అక్షరటుడే, వెబ్డెస్క్: Parliament Sessions | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు(Parliament Monsoon Sessions) జూలై 21 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. మణిపూర్ వస్తువులు. సేవల పన్ను (సవరణ) బిల్లు, 2025, ఆదాయపు పన్ను బిల్లు, 2025 వంటివి ఉన్నాయి.
పార్లమెంటులో మొత్తం 8 బిల్లులను ప్రవేశపెట్టనుంది. లోక్‌సభలో ప్రవేశపెట్టి ఆమోదించడానికి చర్యలు చేపట్టింది. మణిపూర్ వస్తువులు, సేవల పన్ను (సవరణ) బిల్లు 2025, జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు 2025, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (సవరణ) బిల్లు 2025, పన్నుల చట్టాలు (సవరణ) బిల్లు 2025, భూ వారసత్వ ప్రదేశాలు, భౌగోళిక అవశేషాలు (సంరక్షణ, నిర్వహణ) బిల్లు 2025, గనుల (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు 2025, జాతీయ క్రీడా పాలన బిల్లు 2025, జాతీయ డోపింగ్ నిరోధక (సవరణ) బిల్లు 2025లను కేంద్రం లోక్‌సభ(Lok Sabha)లో ప్రవేశపెట్టనుంది.
గోవా రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాలలో షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్య పునర్వ్యవస్థీకరణ బిల్లుతో పాటు మర్చంట్ షిప్పింగ్ బిల్లు 2024, భారతీయ ఓడరేవుల బిల్లు 2025, ఆదాయపు పన్ను బిల్లు 2025 వంటివి కూడా సభ ముందుకు తేనుంది.
Parliament Sessions | ఆగస్టు 21 వరకు సమావేశాలు..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 21న ప్రారంభమై ఆగస్టు 21న ముగుస్తాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు (Minister Kiren Rijiju) తెలిపారు. మూడు నెలలకు పైగా విరామం తర్వాత రాజ్యసభ, లోక్‌సభ రెండూ జూలై 21న ఉదయం 11 గంటలకు సమావేశమవుతాయి. బడ్జెట్ సమావేశాలు (Budget Meetings) జనవరి 31న ప్రారంభమై ఏప్రిల్ 4న ముగిశాయి. ఆ రోజు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.