అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Court | న్యాయవ్యవస్థలో పారా లీగల్ వలంటీర్లు కీలక భాగస్వాములుగా ఉన్నారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీఆర్ఆర్ వరప్రసాద్ (district judge VRR Varaprasad) అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (Legal Services Authority kamareddy) కామారెడ్డి ఆధ్వర్యంలో పారాలీగల్ వలంటీర్ల (Paralegal volunteers) కోసం నిర్వహించిన రెండు రోజుల అవగాహన శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న న్యాయమూర్తి వరప్రసాద్ మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థను సామాన్య ప్రజలకు చేరువ చేసే వంతెనలా వలంటీర్లు పనిచేస్తున్నారన్నారు. అవగాహన లేక అన్యాయాలకు గురవుతున్న గ్రామీణ, వెనుకబడిన వర్గాల ప్రజలకు వలంటీర్లు అండగా నిలుస్తున్నారని తెలిపారు. కేవలం సమస్యలు వినడమే కాదని, వాటికి పరిష్కార మార్గాలు చూపించే సామర్థ్యం కలిగి ఉండాలని సూచించారు.
Kamareddy Court | ప్రజల పట్ల సానుభూతి చూపించాలి..
పారాలీగల్ వలంటీర్లు సేవా దృక్పథంతో, న్యాయ నైతికతతో, ప్రజల పట్ల సానుభూతితో ముందడుగు వేయాలని సూచించారు. ప్రతి సమస్యను మన సమస్యగా చూసే హృదయాన్ని కలిగి ఉండాలన్నారు. ఈ రెండు రోజుల శిక్షణా శిబిరం ద్వారా మానవ హక్కులు, మానసిక ఆరోగ్యం, చైల్డ్ ప్రొటెక్షన్, మహిళా సంక్షేమం, సివిల్, క్రిమినల్ చట్టాలపై ప్రాథమిక అవగాహన కలిగి ప్రజలకు సేవలందించేందుకు సిద్ధమవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
అనంతర వలంటీర్లకు ఐడీ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాణి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హన్మంత్ రావు, నేచురోపతి వైద్యుడు డా. దేవా, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలు స్వర్ణలత, మానసిక వైద్య నిపుణుడు డా. వివేక్, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ కోటేశ్వర్లు, న్యాయవాదులు విఠల్ రావు, వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.