అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Trap | రాష్ట్రంలో అవినీతి అధికారులు మారడం లేదు. సామాన్య ప్రజల నుంచి మొదలు పెడితే ఉద్యోగుల వరకు అందరిని లంచాల పేరిట వేధిస్తున్నారు. నిత్యం ఏసీబీ దాడులు (ACB raids) జరుగుతున్నా లంచాలకు మరిగిన అధికారులు కనీసం భయపడడం లేదు. కొంతమంది అధికారులైతే డబ్బులు తీసుకోవడం కూడా ఒక డ్యూటీగా భావిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తాజాగా లంచం తీసుకుంటూ పంచాయతీ రాజ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ (Panchayat Raj Engineer-in-Chief) అధికారులకు దొరికాడు.
ఓ ఉద్యోగి బదిలీ కోసం పంచాయతీ రాజ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ వీరవల్లి కనకరత్నంను కలిశాడు. అయితే సదరు ఉద్యోగికి బదిలీ, పోస్టింగ్ ఇవ్వడం కోసం ఆయన రూ.50 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు (ACB officials) ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు బుధవారం ఈఎన్సీ వీరవల్లి కనకరత్నం లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు.
ACB Trap | అందరిది అదే దారి..
రాష్ట్రంలో అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. ఆపరేటర్ నుంచి మొదలు పెడితే రాష్ట్రస్థాయి అధికారుల వరకు లంచాలు తీసుకుంటున్నారు. కింది స్థాయి ఉద్యోగుల ప్రజలు, కాంట్రాక్టర్లను లంచాల కోసం వేధిస్తుండగా.. పెద్ద స్థాయి అధికారులు ఉద్యోగులను లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు తాజా ఘటనతో తేలింది. పంచాయతీ రాజ్ శాఖలో (Panchayat Raj department) కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించడానికి పర్సంటేజీలు డిమాండ్ చేస్తారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే ఉద్యోగి బదిలీ కోసం ఏకంగా ఇంజినీర్ ఇన్ చీఫ్ లంచం తీసుకుంటూ దొరకడం ఆ శాఖలో తీవ్ర చర్చకు దారి తీసింది.
ACB Trap | లంచం అడిగితే ఫిర్యాదు చేయండి
ప్రజలు అధికారులకు లంచాలు ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి ఫోన్ చేయాలని చెబుతున్నారు. 1064 టోల్ ఫ్రీ నంబర్ (ACB Toll Free Number), వాట్సాప్ నంబర్ 9440446106కు సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడతామని తెలుపుతున్నారు. ఏసీబీకి ఫిర్యాదు చేస్తే తర్వాత తమ పనులు కావేమోనని పలువురు భయపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు తెలిపారు. ఎలాంటి భయం వద్దని, సదరు పని పూర్తయ్యే వరకు బాధితులకు ఏసీబీ అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.