అక్షరటుడే, వెబ్‌డెస్క్: Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ సమయంలో రాఫెల్ జెట్ యుద్ధ విమానాలను కూల్చివేశామన్న పాకిస్తాన్ ప్రచారాన్ని డస్సాల్ట్ ఏవియేషన్ ఛైర్మన్, సీఈవో ఎరిక్ ట్రాపియర్ (Dassault Aviation Chairman and CEO Eric Trappier) తోసిపుచ్చారు. పాక్ వాదన పూర్తిగా అసంబద్ధమని, నిరాధారమని పేర్కొన్నారు. మే 7న ‘ఆపరేషన్ సిందూర్’తో (Operation Sindoor) ప్రారంభమైన తాజా ఇండో-పాకిస్తాన్ ఘర్షణ సమయంలో.. J-10C మల్టీ-రోల్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రయోగించిన PL-15E లాంగ్-రేంజ్ క్షిపణులను ఉపయోగించి మూడు రాఫెల్స్తో సహా ఐదు భారత వైమానిక దళ యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు పాకిస్తాన్ వైమానిక దళం పేర్కొంది. అయితే, పాక్ వాదననలను డసో ఏవియేషన్ చీఫ్ ఖండించారు. అయితే, ఇండియా ఒక రాఫెల్ యుద్ధ విమానాన్ని కోల్పోయిందని వెల్లడించారు. అది కూడా సాంకేతిక వైఫల్యం వల్లేనని స్పష్టం చేశారు.
Operation Sindoor | పాక్ ఆరోపణలు నిరాధారం..
మూడు రాఫెల్ జెట్లను కూల్చివేసినట్లు పాకిస్తాన్ వాదన పూర్తిగా తప్పని, నిరాధారమైనదని.. రాఫెల్ విమానాలను తయారు చేసే ఫ్రెంచ్ కంపెనీ డస్సాల్ట్ ఏవియేషన్ అధిపతి ట్రాపియర్ తేల్చి చెప్పారు. అయితే, ఇండియా ఒక విమానం కోల్పోయిందని, అది శత్రువులతో సంబంధం లేకుండా జరిగిందని అంగీకరించారు. అధిక ఎత్తులో సాంకేతిక వైఫల్యం కారణంగా ఈ నష్టం జరిగిందని, భారతదేశం ఒక రాఫెల్ యుద్ధ విమానాన్ని (Rafale fighter jet) కోల్పోయిందని స్పష్టం చేశారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు (Spectra electronic warfare systems) ఎటువంటి శత్రు కార్యకలాపాలను నమోదు చేయలేదని పేర్కొన్నారు. డస్సాల్ట్‌కు పంపిన విమాన లాగ్‌లు కూడా యుద్ధంలో ఎటువంటి నష్టాలను సూచించలేదన్నారు. డస్సాల్ట్ తన విమానాల ఆపరేషన్ నష్టాలను ఎప్పుడూ దాచలేదని ఆయన గుర్తు చేశారు.
Operation Sindoor | ఖండించిన భారత్..
భారత్‌కు చెందిన రాఫెల్ జెట్లను కూల్చివేశామని పాకిస్తాన్ చేస్తున్న అసంబద్ధ వాదనను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. రాఫెల్ జెట్లను పాకిస్తాన్ వైమానిక దళం కూల్చివేసిందని చెప్పడం సరికాదని భారత రక్షణ కార్యదర్శి ఆర్కే సింగ్ (Indian Defense Secretary RK Singh) అన్నారు. “మీరు రాఫెల్స్ అనే పదాన్ని బహువచనంలో ఉపయోగించారు. అది కచ్చితంగా సరైనది కాదని నేను స్పష్టంగా చెబుతున్నాను. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఇండియా చేసిన దాడుల వల్ల పాకిస్తాన్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది. అది మానవ, భౌతిక పరంగా నష్టపోయింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని” అని ఆయన తేల్చి చెప్పారు.
Operation Sindoor | రాఫెల్ వ్యతిరేక ప్రచారం వెనుక చైనా..?
రాఫెల్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంపై ఫ్రాన్స్ విచారణ చేపట్టగా, దీని వెనుక చైనా ఉందని తేలింది. చైనా విదేశీ రాయబార కార్యాలయాల్లోని రక్షణ అటాచ్లు డస్సాల్ట్ రాఫెల్ జెట్లకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేశాయని ఫ్రెంచ్ నిఘా సంస్థ ఇటీవల గుర్తించింది. ప్రపంచ దేశాలు ఫ్రెంచ్ యుద్ధ విమానాలను (French fighter jets) ఎక్కువగా కొనుగోలు చేయవద్దని, బదులుగా చైనా తయారు చేసిన జెట్లను ఎంచుకోవాలని ఒప్పించడానికే ఈ ప్రయత్నాలు చేసినట్లు తెలిపింది.