అక్షరటుడే, వెబ్డెస్క్:India-Pak | భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న తరుణంలో దాయాది దేశం సరిహద్దుల్లో మరోసారి కవ్వింపులకు పాల్పడింది. జమ్మూ కాశ్మీర్(Jammu and Kashmir)లోని నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వెంబడి శుక్రవారం అనేక చోట్ల పాకిస్తాన్ ఆర్మీ దళాలు(Pakistan Army troops) కాల్పులు జరిపింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పొరుగు దేశానికి భారత సైన్యం(Indian Army) దీటుగా సమాధానమిచ్చింది. పాక్ కాల్పులను తిప్పికొడుతూ ఎదురుదాడికి దిగింది. నియంత్రణ రేఖకు సమీపంలోని కొన్ని ప్రాంతాల్లో పాకిస్తాన్ చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. వాటిని మన బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని పేర్కొన్నాయి. 26 మందిని బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడి(Pahalgam terror attack) నేపథ్యంలో ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరపడం గమనార్హం.
India-Pak | ఆర్మీ చీఫ్ పర్యటనకు ముందు..
భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది(Upendra Dwivedi) శుక్రవారం శ్రీనగర్, ఉధంపూర్‌లను సందర్శించడానికి కొన్ని గంటల ముందు ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ పర్యటన సందర్భంగా, ఆయన కాశ్మీర్ లోయలో ఉన్న సీనియర్ ఆర్మీ కమాండర్లు(Senior Army commanders), ఇతర భద్రతా సంస్థ అధికారులతో సమీక్షించనున్నారు. ఆర్మీ చీఫ్ ప్రస్తుత భద్రతా పరిస్థితిని అంచనా వేస్తారని, ఎల్‌ఓసీ(LOC) వెంబడి పాకిస్తాన్ సైన్యం ఇటీవల జరిపిన కాల్పుల విరమణ ఉల్లంఘనలను సమీక్షిస్తారని అధికారులు తెలిపారు.
పహల్గామ్ దాడి తర్వాత సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నారనే ఆరోపణలపై పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా భారత్ తీవ్రంగా స్పందించింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Prime Minister narendra Modi) అధ్యక్షతన జరిగిన భద్రతా వ్యవహరాల క్యాబినెట్ కమిటీ(Cabinet Committee) కీలక నిర్ణయాలు తీసుకుంది. సరిహద్దు ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ తన మద్దతును శాశ్వతంగా ఉపసంహరించుకునే 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. అలాగే, అటారీ సరిహద్దు(Attari border)ను మూసివేసింది. పాకిస్తాన్ పౌరులకు వీసాలు నిలిపి వేయడంతో ఆ దేశ పౌరులు వెంటనే వెళ్లిపోవాలని ఆదేశించింది.