అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pahalgam terrorist attack | కశ్మీర్‌లోని పహల్గామ్(Pahalgam) ఉగ్రదాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనపై అనేక కోణాల్లో విచారణ జరిపిన కేంద్ర నిఘా, దర్యాప్తు సంస్థలు(Investigative agencies) కీలక ఆధారాలు రాబట్టాయి. ఉగ్రదాడి జరిపింది ఐఎస్‌ఐ, హమాస్ ఉగ్రవాద సంస్థలేనని భావిస్తున్నాయి. ఇందుకు సంబంధించి హమాస్ నేతలు ఇదివరకు మాట్లాడిన వీడియోలు సైతం తాజాగా బయటకు వచ్చాయి.
ఐఎస్‌ఐ(ISI) ఉగ్రవాద సంస్థ బంగ్లాదేశ్‌లోనూ తన నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నట్లు కేంద్ర నిఘా సంస్థలు గుర్తించాయి. కొద్ది రోజుల కిందట హమాస్(Hamas) కీలక నేతలు పీవోకే సరిహద్దు వద్ద కనిపించినట్లు ఆధారాలు సేకరించారు. భారీ ర్యాలీలు నిర్వహించినట్లు గుర్తించినప్పటికీ.. దేశంలో ఉగ్రదాడి జరుగుతుందనే విషయాన్ని పసిగట్టలేకపోయాయి. కాగా.. గతంలో ఇజ్రాయిల్‌పై దాడి చేసిన విధంగానే భారత్‌లో దాడికి పాల్పడ్డారని గుర్తించారు.
Pahalgam terrorist attack | అక్కడే ప్రత్యేక శిక్షణ
ఉగ్రవాదులకు పీవోకే సరిహద్దులోనే ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు గుర్తించారు. ఇందుకోసం రహస్య స్థావరాలను కూడా ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. హమాస్ శిక్షణ షెడ్యూల్స్‌ను ఎల్‌ఈటీ, జేఈటీ సంస్థలు ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండగా.. ఈ రెండింటికి కూడా పాక్ ఐఎస్‌ఐ శిక్షణ ఇస్తున్నట్లు ఆధారాలు బయటకు వచ్చాయి. తాజాగా ఉగ్రదాడికి పాల్పడింది కూడా ఇక్కడ శిక్షణ తీసుకున్న వారే అయి ఉంటారని నిఘా సంస్థలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పీవోకే సరిహద్దు వెంబడి భద్రతను మరింత కట్టుదిట్టం చేసిన రక్షణ శాఖ.. ఉగ్రవాదులను మట్టుబెట్టే పనిలో నిమగ్నమై ఉన్నాయి.