అక్షరటుడే, వెబ్డెస్క్:Trump | అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టి వంద రోజులు గడిచాయి. ఈ వంద రోజుల్లో సంస్కరణల పేరిట ఆయన తీసుకున్న అనేక నిర్ణయాలు ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టాయి.
అమెరికా ఫస్ట్ అంటూ ప్రపంచ దేశాలపై సుంకాలు విధించి టారిఫ్ వార్(Tariff War)కు తెరలేపారు. వలస చట్టాలను మార్చి పడేశారు. వేలాది మందిని విదేశీయులను వెనక్కి పంపించేశారు. మొత్తంగా వైట్ హౌస్(White House) లో తన తొలి 100 రోజుల్లో సుంకాల వడ్డింపు, వలస చట్టాలను మార్చడం, దేశీయ, అంతర్జాతీయ విధానాన్ని పునర్నిర్మించడానికి తీసుకున్న నిర్ణయాలు ఎంతో వివాదాస్పదమయ్యాయి. మొత్తానికి ట్రంప్ వేగవంతమైన నిర్ణయాలు వ్యాజ్యాలు, మార్కెట్లో అశాంతి, ప్రపంచ ఉద్రిక్తతలకు దారితీశాయి.
Trump | టారిఫ్ వార్..
ట్రంప్(Trump) అత్యంత దూకుడు చర్యలలో ప్రధానమైది ప్రపంచ దేశాలపై భారీగా సుంకాలను వడ్డించడం. “విముక్తి దినోత్సవం “(Liberation Day) అని పిలిచే ఏప్రిల్ 2న వాణిజ్య అసమతుల్యతను తగ్గించడం, అమెరికన్ తయారీని పెంచడం లక్ష్యంగా భారీగా సుంకాలు పెంచేశారు. చైనా వస్తువులపై 145 శాతం, భారతీయ ఉత్పత్తులపై 26 శాతం వరకు టారిఫ్‌లు ప్రకటించారు. అయితే, ఆకస్మికంగా టారిఫ్‌ల పెంపు ప్రపంచ మార్కెట్లను(World markets) కుదిపేసింది. స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. చివరకు అనేక ఎదురుదెబ్బల తర్వాత వాణిజ్య చర్చలను అనుమతించడానికి ట్రంప్ 90 రోజుల పాటు సుంకాలను నిలిపివేయాల్సి వచ్చింది.
Trump | కఠినమైన వలస విధానాలు
ట్రంప్ వలసలపై కఠిన వైఖరి అవలంభించారు. వలసలపై తీవ్ర ఒత్తిడి తెస్తూ, మొదటి మూడు నెలల్లో 1,39,000 మందిని బహిష్కరించారు. ఫలితంగా డిసెంబర్ 2023లో దాదాపు 2,50,000లుగా ఉన్న వలసల సంఖ్య మార్చి 2025 నాటికి 7,000కి పడిపోయింది. అయితే వలసల విధానంలో అమెరికా అధ్యక్షుడి(America President) నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకతలు వచ్చాయి. సరైన పత్రాలు లేని వలసదారుల పిల్లలకు జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేశారు.
Trump | విద్యాసంస్థల నిధులకు కత్తెర
ఫెడరల్ ఏజెన్సీలు, సైనిక సంస్థలు, ప్రభుత్వ నిధులను పొందుతున్న పాఠశాలలు(Schools), విద్యాసంస్థలకు (Educational Institutions) ట్రంప్ షాక్ ఇచ్చారు. నిధులు నిలిపి వేశారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం సమాఖ్య డిమాండ్లను ప్రతిఘటించినప్పుడు, ట్రంప్ ప్రతిస్పందిస్తూ $2.1 బిలియన్ల నిధులను స్తంభింపజేసి, దాని పన్ను మినహాయింపు హోదాను బెదిరించారు.
Trump | విదేశాంగ విధానంలో కొత్త మార్పులు..
ట్రంప్ పాలనలో అమెరికా విదేశాంగ విధానం పూర్తిగా మారిపోయింది. ప్రపంచ ఉద్రిక్తతలకు కారణహైన ఇజ్రాయెల్-గాజా(Israel-Gaza) యుద్ధంలో స్వల్పకాలిక కాల్పుల విరమణకు ట్రంప్ చొరవే కారణమైంది. ఉక్రెయిన్ రష్యా(Ukraine Russia) యుద్ధాన్ని ముగించడానికి కూడా ట్రంప్ చర్యలు చేపట్టారు. ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేశారు.
Trump | శాఖల కుదింపు..
నిధుల దుబారాను తగ్గించడానికి ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డోజ్‌ను ఏర్పాటు చేస్తూ దానికి ఎలాన్ మస్క్(Elon Musk)ను అధిపతిగా నియమించారు. దీని ద్వారా సుమారు 280,000 ఉద్యోగాలను తొలగించారు. ట్రంప్ అధికారం చేపట్టిన తొలి 100 రోజుల్లో సుంకాల నుండి ఆరోగ్య సంరక్షణ కోతల వరకు 140 కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు సంవత్సరాలలో బిడెన్ సంతకం చేసిన దానికి దగ్గరగా ఇవి ఉండడం గమనార్హం.