అక్షరటుడే, వెబ్‌డెస్క్:Jai Shankar | భారత్, పాకిస్తాన్(India-Pakistan) మధ్య కాల్పుల విరమణ అంశంలో ఎవరి జోక్యం లేదని, భారత్, పాక్ కలిసి చర్చించుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో భాగంగా పీవోకే, పాక్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. అనంతరం పాక్ భారత్‌పై డ్రోన్లు, మిసైళ్లతో దాడులకు యత్నించింది. పాక్ దాడులను తిప్పి కొట్టిన భారత్, పాకిస్తాన్‌లోని ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేసింది.
భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల వేళ రెండు దేశాల డీజీఎంవో(DGMO)లు చర్చించుకొని కాల్పుల విరమణకు అంగీకరించారు. అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(US President Donald Trump) తానే కాల్పుల విరమణకు రెండు దేశాలను ఒప్పించినట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన భారత్ కంటే ముందే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాణిజ్యం పేరు చెప్పి రెండు దేశాల మధ్య అణు యుద్ధాన్ని ఆపానని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై భారత్‌లో తీవ్ర దుమారం రేగింది. ట్రంప్ చెబితే మోదీ(PM Modi) ఎందుకు తలొగ్గారని విపక్షాలు ప్రశ్నించాయి.
విపక్షాల ఆరోపణల నేపథ్యంలో విదేశాంగ మంత్రి జైశంకర్ (External Affairs Minister Jaishankar) కాల్పుల విరమణపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. భారత్, పాక్ మధ్య మాత్రమే కాల్పుల విరమణ గురించి చర్చలు జరిగాయని ఆయన స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ గురించి భారత్ అనేక దేశాలకు సమాచారం ఇచ్చిందని, అందులో అమెరికా కూడా ఉందన్నారు.