అక్షరటుడే, వెబ్‌డెస్క్: pension rules : పెన్షన్ నిబంధనల్లో మార్పులు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర పౌర సేవల (పెన్షన్) నియమాలు, 2021 కింద పెన్షన్ నియమాలకు సంబంధించి ఒక ప్రధాన సవరణను తాజాగా ప్రకటించింది. కొత్త నిబంధన ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులను తొలగించినా లేదా సర్వీస్ నుంచి టెర్మినేట్ చేసినా ఇకపై వారికి పెన్షన్లతో సహా పదవీ విరమణ ప్రయోజనాలు అందవు.
pension rules : అక్రమార్కుల గుండెల్లో దడ..
కేంద్ర పౌర సేవల (పెన్షన్) సవరణ నియమాలు (Central Civil Services (Pension) Amendment Rules) 2025 ద్వారా తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధన అక్రమార్కుల గుండెల్లో బాంబు పేల్చింది. కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో వక్రమార్గం పడుతున్నారు. లంచాలు ఇవ్వనిదే ఏ పని చేయడం లేదు.
కొంత మంది అప్పుడప్పుడు పట్టుబడుతున్నా ఏం కాదులే అన్న ధీమాతో మళ్లీ అవినీతికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేలా కేంద్రం కొత్త నిబంధన తీసుకొచ్చింది. అవినీతికి పాల్పడే ఉద్యోగిని తొలగించడం లేదా తప్పనిసరి నిర్బంధ పదవీ విరమణ చేసిన సందర్భాలలో.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తించకుండా ఆంక్షలు విధించింది. ఉద్యోగులకు బెనిఫిట్స్ తొలగింపు నిర్ణయం తీసుకునే అధికారాన్ని సంబంధిత ప్రభుత్వ రంగ సంస్థ పర్యవేక్షించే పరిపాలనా మంత్రిత్వ శాఖ సమీక్షించి ఆమోదిస్తుంది.
pension rules : కొత్త నియమం ఏమి చెబుతుంది ?
గతంలో PSU ఉద్యోగుల(PSU employees)ను సర్వీసు నుంచి తొలగించిన సందర్భాలలో పదవీ విరమణ ప్రయోజనాలను నిలిపివేయడానికి ఎటువంటి నిబంధన లేదు. కొత్త నిబంధనల ప్రకారం, అవినీతి లేదా ఇతర తీవ్రమైన దుష్ప్రవర్తనకు పాల్పడ్డారన్న అభియోగాలతో తొలగించబడిన ఏ ఉద్యోగి అయినా వారి పెన్షన్, పదవీ విరమణ తర్వాత ఇతర హక్కులను కోల్పోతారు. అయితే, ఈ నిర్ణయం సంబంధిత పరిపాలనా మంత్రిత్వ శాఖ సమీక్షకు లోబడి ఉంటుంది.
pension rules : వీరికి వర్తించదు..
కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన నిబంధన నుంచి కొంత మంది ఉద్యోగులను మినహాయించింది. రైల్వే ఉద్యోగులు, సాధారణ, రోజువారీ వేతన కార్మికులు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (Indian Administrative Service – IAS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (Indian Police Service – IPS), ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (Indian Forest Service – IFoS) అధికారులకు కొత్త నిబంధన వర్తించదు. అయితే, డిసెంబర్ 31, 2003న లేదా అంతకు ముందు నియమితులైన అన్ని ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తాయి.
pension rules : అవినీతిని అరికట్టేందుకు..
ప్రజా సేవలో అవినీతి, దుష్ప్రవర్తన పట్ల కేంద్ర ప్రభుత్వం కఠినమైన వైఖరిని తాజా నిర్ణయం సూచిస్తోంది. పెన్షన్ అర్హతను నేరుగా ఉద్యోగి ప్రవర్తనకు అనుసంధానించడం ద్వారా ఉద్యోగుల్లో జవాబుదారీతనాన్ని పెంచడం, చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ సేవలో ఉన్నత నైతిక ప్రమాణాలు, పారదర్శకతను తీసుకురావడానికి విస్తృత పరిపాలనా సంస్కరణలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ Ministry of Personnel, Public Grievances and Pensions (DoPT) పేర్కొంది.