అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nimisha Priya | భారత దౌత్యాధికారులు విస్తృత ప్రయత్నాల తర్వాత భారతీయ నర్సు నిమిషా ప్రియ మరణశిక్షను యెమెన్ ప్రభుత్వం (Yemen Government) రద్దు చేసిందని గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ వ్యవస్థాపకుడు కేఏ పాల్(KA Paul) ప్రకటించారు. యెమెన్ నాయకుల శక్తివంతమైన ప్రయత్నాలు ఫలించాయంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం యెమెన్‌లోని సనా నుంచి ఓ వీడియో విడుదల చేశారు. గత పది రోజులుగా ఈ నాయకులు పగలూ రాత్రి ప్రయత్నాలు చేయడం ద్వారా 24 గంటలూ పనిచేశారని పాల్ పేర్కొన్నారు.
Nimisha Priya | ఇండియాకు తిరిగి వస్తారు..
నిమిషాప్రియ సురక్షితంగా ఇండియా(India)కు చేరుకుంటుందని పాల్ తెలిపారు. సనా జైలు నుంచి ఒమన్, జెడ్డా, ఈజిప్ట్, ఇరాన్ లేదా తుర్కియేలకు ఆమెను సురక్షితంగా స్వదేశానికి తరలించడానికి భారత ప్రభుత్వంతో కలిసి లాజిస్టిక్స్ ఏర్పాట్లు చేసుకోవచ్చని కూడా ఆయన అన్నారు. “నిమిషా ప్రియ మరణం రద్దు కోసం కృషి చేసిన అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుని దయతో, ఆమె విడుదలై, సురక్షితంగా భారతదేశానికి వెళతారు. దౌత్యవేత్తలను పంపడానికి, నిమిషాను వృత్తిపరంగా, సురక్షితంగా తీసుకెళ్లడానికి సిద్ధమైనందుకు ప్రధానమంత్రి మోదీ(Prime Minister Modi) జీకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని” తెలిపారు.
యెమెన్‌లో వ్యాపార భాగస్వామిని హత్య చేశారన్న ఆరోపణలపై కేరళ(Kerala)కు చెందిన నిమిషా ప్రియకు అక్కడి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. అక్కడి ప్రభుత్వం కూడా దీన్ని సమర్థించింది. చివరకు జూలై 16న ఆమెను ఉరి తీయాలని నిర్ణయించారు. అయితే, భారత దౌత్యవేత్తలతో పాటు మత పెద్దల జోక్యంతో చివరి నిమిషంలో ఉరి వాయిదా పడింది. అయితే, బ్లడ్ మనీకి అంగీకరించని బాధితుడి కుటుంబం ఆమెకు ఉరిశిక్ష విధించాలని పట్టుబట్టింది. ఈ నేపథ్యంలోనే ఆమె శిక్ష రద్దయినట్లు కేఏ పాల్ ప్రకటించడం విశేషం.