అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nimisha Priya | యెమెన్‌లో కేరళ నర్సు నిమిషప్రియకు (Kerala nurse Nimisha Priya) ఉరి శిక్ష వాయిదా పడింది. ఉరిశిక్ష అమలును వాయిదా వేస్తూ యెమెన్ కోర్టు నిర్ణయం తీసుకుంది. హత్య కేసులో అరెస్టయిన ఆమెకు అక్కడి కోర్టు మరణ శిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే 16వ తేదీన ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉండగా.. కోర్టు తాత్కాలికంగా వాయిదా వేసింది. కాగా.. నిమిషప్రియను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. యెమెన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది.
Nimisha Priya | అసలేం జరిగిందంటే..?
కేరళ(Kerala)కు చెందిన నిమిష ప్రియ నర్సుగా పనిచేయడానికి 2008లో యెమెన్‌కు వెళ్లింది. అక్కడ కొన్నాళ్ల పాటు పలు ఆస్పత్రుల్లో పని చేసింది. అనంతరం సొంతంగా క్లినిక్ పెట్టుకోవాలని ఆలోచించింది. అయితే యెమెన్ రూల్స్ ప్రకారం.. ఇతర దేశస్తులు అక్కడ వ్యాపారం చేయాలంటే స్థానికులను భాగస్వాములుగా నియమించుకోవాలి. ఈ రూల్ ఉండడంతో నిమిషా తలాల్ అబ్దో మహది(Talal Abdo Mahdi) అనే వ్యక్తిని బిజినెస్ పార్టనర్‌గా చేర్చుకుంది.
క్లినిక్ పెట్టిన తర్వాత వారి మధ్య గొడవలు వచ్చాయి. దీంతో నిమిషా అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తలాల్ అబ్దో మహదిని పోలీసులు అరెస్ట్ చేయగా జైలుకు వెళ్లి 2016లో విడుదలయ్యాడు. బయటకు వచ్చిన అనంతరం అతడు నిమిషాను వేధించడం ప్రారంభించాడు. ఆమె పాస్‌పోర్టు తన వద్ద పెట్టుకొని ఇబ్బంది పెట్టాడు.
దీంతో అతడిని చంపి పాస్‌పోర్టు(Pass Port) తీసుకొని పారిపోవాలని నిమిషా ప్లాన్ వేసింది. ఈ మేరకు 2017లో ఇంజెక్షన్ ఇచ్చి అతన్ని హత్య చేసింది. అనంతరం పాస్‌పోర్టు తీసుకొని ఇండియాకు తిరిగి వస్తుండగా అక్కడ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఆమెను దోషిగా తేల్చిన కోర్టు మరణ శిక్ష విధించింది.
కాగా.. యెమెన్ జైల్లో ఉన్న నిమిష ప్రియ విడుదలపై అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి (Prime Minister Narendra Modi) కేరళ సీఎం విజయన్ (Kerala CM Vijayan) లేఖ రాసిన విషయం తెలిసిందే. నమిష ప్రియ అంశంపై సుప్రీంకోర్టులో సైతం విచారణ జరిగింది. ఉరిశిక్ష నుంచి నిమిషాను రక్షించేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీం వాదనలు విన్నది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించిన అటార్నీ జనరల్ నిమిషాను రక్షించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని కోర్టుకు చెప్పిన విషయం తెలిసిందే.