అక్షరటుడే, వెబ్‌డెస్క్:Pashamylaram | వారిద్దరు వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చారు. పేద కుటుంబాల్లో పుట్టి కష్టపడి చదువుకొని ఒకే కంపెనీలో కొలువు సాధించారు. అనంతరం మంచి మిత్రులుగా మారిన వారిలో ప్రేమ చిగురించింది. దీంతో ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కొత్త జీవితాన్ని ఆనందంగా గడపాలని కలలు కన్నారు. అయితే వారి కలలను విధి కల్లలు చేసింది. పాశమైలారం(Pashamylaram)లో రియాక్టర్ పేలిన ఘటనలో నవ దంపతులు మృతి చెందారు.
సంగారెడ్డి జిల్లా(Sangareddy District) పాశమైలారంలోని సిగాచి కంపెనీలో సోమవారం రియాక్టర్ పేలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 36 మంది మృతి చెందగా.. 17 మంది ఆచూకీ లభించడం లేదు. పలువురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఓ నూతన జంట చనిపోయింది.
Pashamylaram | ఇటీవల ఉద్యోగంలో చేరి..
కడప జిల్లా(Kadapa District)కు చెందిన నిఖిల్ కుమార్ రెడ్డి సిగాచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట(Vissannapet)కు చెందిన రమ్యశ్రీ కూడా అదే పరిశ్రమలో పనిచేస్తోంది. దీంతో వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. పెళ్లికి కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో వారు రెండు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం ఇటీవల ఉద్యోగాల్లో చేరారు. అయితే కుటుంబ సభ్యులు వారి పెళ్లిని అంగీకరించారు. ఆషాఢ మాసం అయిపోయాక ఫంక్షన్ చేద్దామని నిర్ణయించుకున్నారు. ఇంతలోనే రియాక్టర్ పేలుడు(Reactor Explosion) ఘటనలో నవ దంపతులు మృతి చెందారు. దీంతో రెండు గ్రామాల్లో విషాదం నెలకొంది. పోలీసులు పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.