అక్షరటుడే, హైదరాబాద్: wine industry : తెలంగాణ (Telangana) రాష్ట్రంలో వైన్‌కు రోజురోజుకీ డిమాండ్ పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా భారీగా అమ్మకాలు కొనసాగుతున్నాయి. గత ఆరు నెలల్లోనే (జనవరి–జూన్) 2.67 లక్షల వైన్ కార్టున్స్ విక్రయించారు. వీటి విలువ రూ.300 కోట్లు. కాగా, ఇందులో రాష్ట్రంలోనే ఉత్పత్తి అయినవి కేవలం 8,725 కార్టున్స్(కేసులు) కావడం గమనార్హం. మిగతావి దేశవిదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవే.
Wine Industry : అనువైన ప్రాంతాలు ఇవే..
రాష్ట్రంలో ఏర్పడుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా వైన్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించింది. హైదరాబాద్ (Hyderabad), రంగారెడ్డి (Rangareddy) పరిధిలోని పలు ప్రాంతాలను పరిశీలించింది. పరిశ్రమల ఏర్పాటుకు అనువైన కేంద్రాలను గుర్తించింది. ఈ ప్రాంతాల్లో ద్రాక్ష తోటలు 700 ఎకరాలకుపైగా విస్తరించి ఉన్నాయి. ఇది ఈ ప్రాంతాలకు ప్లస్ పాయింట్‌గా మారటం విశేషం.
Wine Industry : మూడు సంస్థలు దరఖాస్తు..
రాష్ట్రంలో వైన్ పరిశ్రమల ఏర్పాటుకు కొత్తగా మూడు సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. అవి బ్లూసీల్ (Blue Seal), బగ్గా (Bagga ), ఈరియా (Eria) అనే సంస్థలు. కాగా, వీటిలో ఒక కంపెనీకి మొదట అనుమతిని ఇచ్చే అవకాశాన్ని సర్కారు పరిశీలిస్తోంది. ఇదే విషయంపై ఇటీవలే మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) సమీక్షించారు. ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. దీనిపై సర్కారు తుది నిర్ణయం తీసుకోనుంది.
Wine Industry : ప్రస్తుతం ఒక్కటే పరిశ్రమ..
ప్రస్తుతం రాష్ట్రంలో ఒకే ఒక వైన్ పరిశ్రమ ఉంది. ఇది యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలో ఉండటం గమనార్హం. ఇక్కడ ఏడాదికి 8 లక్షల బల్క్ లీటర్ల వైన్ ఉత్పత్తి అవుతోంది. స్థానిక వినియోగానికి ఇది ఎలాగూ సరిపోని పరిస్థితి. రాష్ట్రంలో మరిన్ని వైన్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే.. రాష్ట్రానికి ఆదాయం పెరగనుంది.
Wine Industry : రైతులకు ప్రయోజనం..
ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్లకు కేంద్రం రాయితీలు ఇస్తోంది. వైన్ పరిశ్రమల ఏర్పాటుతో రైతులకు సైతం ప్రయోజనం చేకూరనుంది. ద్రాక్షతో పాటు ఉసిరి, ఆపిల్, పైనాపిల్, అరటి వంటి పండ్లతో వైన్ తయారీకి వీలు ఉంది. ఇది కూడా రైతులకు కలిసొచ్చే అంశం.
Wine Industry : ఏటా వైన్ అమ్మకాలు ఇలా..
- 2021-22 : 1.87 లక్షల కేసులు (రూ.201 కోట్లు)
- 2022-23 : 2.35 లక్షల కేసులు (రూ.260 కోట్లు)
- 2023-24 : 2.41 లక్షల కేసులు (రూ.275 కోట్లు)
- 2025 పూర్వార్థం : 2.67 లక్షల కేసులు (రూ.300 కోట్లు)