అక్షరటుడే, వెబ్‌డెస్క్: Brs silver jubilee | బీఆర్ఎస్ రజతోత్సవ సభ దిగ్విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. అధికారం కోల్పోయిన తర్వాత నిర్వహించిన సభకు జనం పోటెత్తడం పార్టీలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.
చాలా రోజుల తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్.. తన ప్రసంగంతో పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచారు. సరిగ్గా 50 నిమిషాల పాటు ప్రసంగించిన ఆయన.. ఒకప్పటి ఉద్యమ నాయకుడ్ని గుర్తుకు తెచ్చారు. సూటిగా, సుత్తి లేకుండా తనదైన వాగ్దాటితో పదునైన విమర్శలతో సభ ప్రాంగణాన్ని హోరెత్తించారు. ఎక్కడా ఎవరి పేరును ఎత్తకుండా కాంగ్రెస్‌పై దాడి చేశారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనతో కాంగ్రెస్ పదహారు నెలల పాలనను పోల్చుతూ.. ప్రజలకు సులువుగా అర్థమయ్యేలా వివరించే ప్రయత్నం చేశారు. ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని, అన్ని డైరీలో రాసుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కొన్నాళ్లు టైం ఇవ్వాలని ఇన్నాళ్లు బయటకు రాలేదు. ఇక నుంచి బయటకు వస్తా.. అందరి తరఫున పోరాడతానని చెప్పారు. ఎవరెన్ని చేసినా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
Brs silver jubilee | జనసంద్రమైన ఎల్కతుర్తి
బీఆర్ఎస్ పాతికేళ్ల పడిలోకి అడుగిడుతున్న సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన రజతోత్సవ సభకు జనం పోటెత్తారు. ఉమ్మడి పది జిల్లాల నుంచి వేలాదిగా కార్యకర్తలు తరలి వచ్చారు. దీంతో ఎల్కతుర్తి గులాబీమయమైంది. 1200 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ సభకు కార్యకర్తలు మధ్యాహ్నం నుంచే చేరుకోవడం ప్రారంభమైంది. సాయంత్రానికల్లా సభా ప్రాంగణం పూర్తిగా నిండిపోయింది. అటు వరంగల్, ఇటు హుస్నాబాద్, కరీంనగర్ మార్గాల్లో వాహనాలు బారులు తీరాయి. రెండు లక్షల కుర్చీలు వేయగా అవి ఏమాత్రం సరిపోలేదు. ఊహించిన దానికంటే జనం ఎక్కువగా తరలి రావడంతో పార్టీలో సరికొత్త ఉత్సాహం నెలకొంది. ప్రజలను తరలించడంలో బీఆర్ఎస్ సక్సెస్ అయింది.
అధికారం కోల్పోయిన తర్వాత కేడర్ నైరాశ్యంలో కూరుకు పోయింది. అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితం కావడంతో శ్రేణులు ఢీలా పడ్డాయి. గత 16 నెలల్లో కేసీఆర్ ఒక్కసారి మాత్రమే నల్లగొండలో నిర్వహించిన రైతు గర్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు గానీ, ఆ తర్వాత గానీ ఆయన బయటకే రాలేదు. కేటీఆర్, హరీశ్‌రావు, కవిత జనాల్లో తిరుగుతున్నా కేడర్‌లో అంతగా జోష్ కనిపించలేదు. అయితే, చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటకు రావడంతో పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలు సైతం ఆసక్తిగా ఎదురు చూశారు. మొత్తంగా రజతోత్సవ సభ, కేసీఆర్ ప్రసంగం పార్టీ శ్రేణులకు బూస్ట్ ఇచ్చినట్లయింది.
Brs silver jubilee | పదునైన విమర్శలతో దాడి..
ఇన్నాళ్లు ఫామ్‌హౌస్‌కే పరిమితమైన కేసీఆర్.. సీఎం రేవంత్‌రెడ్డి సహా ఎవరూ సవాల్ చేసినా బయటకు రాలేదు. రజతోత్సవ సభ సందర్భంగా బయటకు వచ్చిన ఆయన.. ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఎక్కడా ఎవరి పేరు ఎత్తకుండానే రేవంత్‌పైనా, కాంగ్రెస్‌పైనా విమర్శల దాడి చేశారు. “అసెంబ్లీకి రావాలని నాకు సవాల్ విసురుతున్నారు. పిల్లలు (కేటీఆర్, హరీశ్‌రావు) అడిగితేనే తట్టుకుంటలేరు.. నేను రావాల్నా..” అని రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రానికి నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీ అని చెబుతూ గతాన్ని మరోసారి గుర్తు చేశారు. పదవుల కోసం ఇష్టమొచ్చినట్లు హామీలు ఇచ్చారని, వాటిని అమలు చేయకుండా మోసం చేశారన్నారు. “కాంగ్రెస్ వచ్చి ఏడాదైంది.. తెలంగాణకు మాయరోగం వచ్చినట్లయింది. కేసీఆర్ ఉన్నప్పుడు దేశంలో నంబవర్‌వన్‌గా ఉన్న తెలంగాణ ఇప్పుడెందుకు 14వ స్థానానికి పడి పోయిందని” ప్రశ్నించారు.
గోల్‌మాల్ చేయడంలో, అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్‌ను మించినోడు లేడని విమర్శించారు. పెన్షన్లు, రైతుబంధు, రుణమాఫీ, స్కూటీలు, విద్యార్థులకు గ్యారంటీ కార్డులు, పంటలకు బోనస్, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని చెప్పి ఏమీ ఇవ్వకుండా మోసం చేశారని మండిపడ్డారు. తెలంగాణలోని అన్ని దేవుళ్లపై ఒట్టు వేశారు.. ఏమైనా చేశారా..? అని ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్సు అని తెస్తిరి. జుట్లు పట్లుకుని కొట్టుకునేందుకు పనికొచ్చిందంటూ రేవంత్ సర్కార్‌పై కేసీఆర్ తనదైన రీతిలో విమర్శలు ఎక్కుపెట్టారు.
Brs silver jubilee | కగర్ పేరిట ప్రాణాలు తీస్తారా?
బీజేపీపైనా కేసీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఆపరేషన్ కగర్ Bjp operation kagar పేరుతో అమాయకులను చంపుతున్నారని ఆరోపించారు. బీజేపీది అంతా “బబ్రజమనం.. భజగోవిందం టైపు. శుష్క ప్రియాలు.. శూన్య హస్తాలు” తప్ప బీజేపీ చేసేందేమీ లేదన్నారు. ఆపరేషన్ కగర్ పేరుతో చత్తీస్‌గఢ్‌లో ఆదివాసీలు, యువతను కాల్చి చంపుతున్నారన్నారు. బలగాలు ఉన్నాయని అందర్ని చంపుకుంటా పోతారా..? ఇదేనా ప్రజాస్వామ్యమంటే అని ప్రశ్నించారు. “నక్సలైట్లు చర్చలకు వస్తామని చెబుతున్నారు. వాళ్లను చర్చలకు పిలవాలి కదా..? ఆపరేషన్ కగార్ తక్షణమే నిలిపి వేయాలి” అని కేసీఆర్ డిమాండ్ చేశారు. నక్సల్స్‌తో చర్చలు జరపాలని కోరారు.