అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | కామారెడ్డి పట్టణంలో లభించిన పేలుడు పదార్థాలతో తన భర్తకు సంబంధం లేదని.. టీపీసీసీ జనరల్ సెక్రెటరీ (TPCC General Secretary) గడ్డం చంద్రశేఖర్ రెడ్డి (Gaddam Chandrasekhar Reddy) సతీమణి, మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ ఇందుప్రియ అన్నారు. సంబంధం లేని కేసులో తన భర్తను అరెస్ట్ చేశారని వాపోయారు. కామారెడ్డిలోని తన నివాసంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు.
2023 ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తరపున ఎన్నికల్లో ప్రచారం నిర్వహించడంతో తమ కష్టానికి గుర్తింపుగా తన భర్తకు టీపీసీసీ జనరల్ సెక్రెటరీగా అవకాశం ఇచ్చారన్నారు. పదవి వచ్చినప్పటి నుంచి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు.
Kamareddy | సోషల్‌మీడియా ద్వారా తప్పుడు ప్రచారం..
అలాంటి తమపై సోషల్ మీడియా (Social media) వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని గడ్డం ఇందుప్రియ ఆరోపించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారి వివరాలన్నీ తనవద్ద ఉన్నాయని, అవసరం వచ్చినప్పుడు బయటపెడతానని పేర్కొన్నారు.
Kamareddy | శ్రీవారి వెంచర్‌కు మాకు సంబంధం లేదు..
మూడు రోజుల నుంచి ప్రోబెల్స్ స్కూల్ (Probells School) సమీపంలో దొరికిన పేలుడు పదార్థాలకు, శ్రీవారి వెంచర్‌కు ముడి పెడుతున్నారని ఆరోపించారు. దానికి తమతో ఎలాంటి సంబంధం లేదన్నారు. శ్రీవారి వెంచర్లో తన భర్తకు గుంట భూమి కూడా లేదని, రాజకీయ కక్షతోనే ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్ నుంచి రాత్రి 9:30 గంటలకు ఫోన్ రాగానే తన భర్త ఇంటి నుంచి వెళ్లాడని, 11 గంటలకు అరెస్ట్ చేస్తున్నట్లు తనకు ఫోన్ వస్తే వెళ్లానని పేర్కొన్నారు.
Kamareddy | ఎలాంటి సమాచారం లేకుండానే అరెస్ట్‌లా..?
తనకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తన భర్తను అరెస్ట్ చేశారని ఇందుప్రియ పేర్కొన్నారు. బిచ్కుంద కోర్టు వద్ద (Bichkunda Police Station) వద్ద రిమాండ్ చేశారని వివరించారు. అక్కడి నుంచి నిజామాబాద్ సారంగపూర్ సెంట్రల్ జైలుకు (Sarangpur Central Jail) తరలించారని తెలిపారు.
శ్రీవారి వెంచర్‌ను 2023లోనే విభూస్ ఎకో టౌన్ షిప్ వారికి డెవలప్మెంట్కు లీజ్ అగ్రిమెంట్ చేసి ఇవ్వడం జరిగిందన్నారు. తన భర్తను అరెస్ట్ చేయడానికి ముందు తమకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదన్నారు. ఈ కేసులో తాము చట్ట ప్రకారం ముందుకు వెళ్తామని తెలిపారు. చట్టంపై తమకు నమ్మకం ఉందన్నారు. తన భర్త జైలు నుంచి వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.