అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indiramma Houses | రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం(Indiramma House Scheme) ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా ఇప్పటికే తొలివిడతలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తియింది.
లబ్ధిదారుల ఎంపిక కోసం ఇందిరమ్మ గ్రామ కమిటీలు వేశారు. అయితే ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకుల సూచన మేరకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. పలు గ్రామాల్లో అనర్హులకు కూడా ఇళ్లు కేటాయించారని పలువురు ఆరోపించారు. అయితే అనర్హులకు ఇళ్లు కేటాయించినట్లు తెలిస్తే ప్రోసిడింగ్లు రద్దు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) గతంలోనే ప్రకటించారు. అయితే ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక విషయంలో తమకు అవకాశం కల్పించాలని తాజాగా మెదక్ ఎంపీ రఘునందన్‌రావు కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)కి ఆయన లేఖ రాశారు.
లబ్ధిదారుల ఎంపికలో ఎంపీలకు కూడా 40 శాతం కోటా ఇవ్వాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు(BJP MP Raghunandan Rao) డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల మాదిరిగా ఎంపీలను కూడా ప్రజలే ఎన్నుకున్నారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలోని 17 మంది ఎంపీలకు లబ్ధిదారుల ఎంపికలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(Prime Minister Awas Yojana) నిధులను కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో వినియోగిస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు. గతంలో ఎంపీగా పనిచేసిన సీఎం రేవంత్ వెంటనే నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.