అక్షరటుడే, హైదరాబాద్: Real Estate | తెలంగాణ (Telangana) రాజధాని హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం విక్రయాలు లేక కొట్టుమిట్టాడుతోంది. ఓ వైపు నిర్మాణం పూర్తి చేసుకున్న వాటి అమ్మకాలు లేక వ్యాపారులు అల్లాడుతున్నారు. మరోవైపు ఆకాశ హర్మ్యాల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. విక్రయాల జోరు లేకున్నా.. నిర్మాణాలు మాత్రం ఆగడం లేదు. రోజుకో కొత్త నిర్మాణం పుట్టుకొస్తోంది.
Real Estate | వాస్తవంగా…
హైడ్రా (Hydraa) వచ్చాక గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) లో రియల్ వ్యాపారం తీవ్రంగా ఒడుదుడుకులను ఎదుర్కొంటోందని వాదన ఉంది. ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసుకున్న వాటి విక్రయాలు మందగించాయి. ప్రస్తుత గణాంకాల వివరాలను ప్రముఖ నైట్ ఫ్రాంక్ ఇండియా 2025.. తన అర్ధ వార్షిక నివేదికలో వెల్లడించింది.
దీని ప్రకారం.. నిర్మాణ పరంగా వివిధ దశలలో ఉన్నవి, నిర్మాణం పూర్తయి విక్రయాలు కానివి కలిపి(ఇన్వెంటరీ) 54,458 యూనిట్లు ఉన్నాయి. గతేడాదితో పోల్చితే ఈ ఇన్వెంటరీ స్థితి 11 శాతం పెరిగింది. ఇలా మిగిలిపోయినవి అమ్ముడుపోవాలంటే సుమారు ఆరు త్రైమాసికాల సమయం పడుతుంది.
Real Estate | దేశ వ్యాప్తంగా 5 లక్షలకు పైగా..
ఇక దేశవ్యాప్తంగా గణాంకాలను పరిశీలిస్తే దిమ్మతిరిగిపోతుంది. ఎందుకంటే ఐదు లక్షలకుపైగా అమ్ముడుపోని గృహాలు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా దేశ ఆర్థిక రాజధాని ముంబయి (Mumbai)లోనే మిగిలిపోవడం గమనార్హం. ఇక్కడ అమ్ముడుపోని ఇళ్లు 1.6 లక్షలకు పైగా ఉన్నాయి. కానీ, గతేడాదితో పోల్చి చూస్తే ముంబయిలో ఇన్వెంటరీ తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ అదే పరిస్థితి. ఇక్కడ లక్ష వరకు ఉన్నాయి. బెంగళూరులో అర లక్ష చొప్పున మిగిలిపోయాయి.
Real Estate | ఇప్పట్లో అమ్ముడయ్యే పరిస్థితి ఉందా..
మిగిలిపోయిన ఇళ్ల విక్రయానికి ఢిల్లీలో కాస్త ఎక్కువ రోజులే పట్టేటట్లు ఉంది. అంటే 7.4 త్రైమాసికాల(దాదాపుగా రెండేళ్లకు పైగా) వరకు సమయం తీసుకోనుంది. ముంబయిలో 6.9 త్రైమాసికాలు, హైదరాబాద్‌లో మాత్రం 5.9 త్రైమాసికాల సమయం వేచి ఉండాల్సిందేనని నైట్ ఫ్రాంక్ ఇండియా సంస్థ నివేదిక సారాంశం. బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నైలో ఏడాదికి అటుఇటుగా సమయం పడుతుందట.