అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Rahul Gandhi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ(Rahul Gandhi) శనివారం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నిర్ణయించిన సుంకాల గడువుకు మోదీ తలొగ్గుతారని తెలిపారు. గడువు ఆధారంగా ఒప్పందాలు జరుగవని, జాతీయ ప్రయోజనాల దృష్ట్యానే వాణిజ్య ఒప్పందాలు జరుగుతాయని కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్(Minister Piyush Goyal) చేసిన వ్యాఖ్యలపై రాహుల్‌గాంధీ స్పందించారు. పియూష్ గోయల్ చెప్పినంత సులువుగా జరగదని, ట్రంప్ సుంకాల గడువుకు మోదీ తలొగ్గుతారని ఆరోపించారు. “పియూష్ గోయల్ తనకు కావాల్సినంతగా బలంగా తన ఛాతీని కొట్టుకోగలడు. నా మాట గుర్తుంచుకోండి. ట్రంప్ సుంకాల గడువుకు మోదీ సులువుగా తలొగ్గుతారని” ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’లో పోస్ట్ చేశారు. ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తానే మధ్యవర్తిత్వం వహించి కాల్పుల విరమణకు ఒప్పించానని ట్రంప్ ప్రచారం చేసుకుంటున్న తరుణంలో.. దీనిపై ప్రధాని మోదీ (PM Narendra Modi) స్పందించక పోవడంపై రాహుల్‌గాంధీ పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా అగ్రరాజ్యంతో ఒప్పందంపైనా ప్రధాని నుంచి స్పందన లేకపోవడంతో మరోసారి ఆరోపణలు సంధించారు.
Rahul Gandhi | జూలై 9తో ముగియనున్న గడువు..
అమెరికా(America)తో వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్.. జులై 9వ వరకు గడువు ఇచ్చారు. లేకపోతే భారీగా సుంకాలు వడ్డిస్తానని గతంలో హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అమెరికా-భారత్ మధ్య ఉధృతంగా చర్చలు జరుగుతున్నాయి. జులై 9కి కంటే ముందే ఇరు దేశాల మినీ ఒప్పందం కుదిరే అవకాశముందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందాన్ని(Trade agreement) జాతీయ ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే భారతదేశం అంగీకరిస్తుందని గోయల్ శుక్రవారం పేర్కొన్నారు. “జాతీయ ప్రయోజనం ఎల్లప్పుడూ అత్యున్నతంగా ఉండాలి. దానిని దృష్టిలో ఉంచుకుని, ఒప్పందం కుదుర్చుకోవాలి, భారతదేశం ఎల్లప్పుడూ అభివృద్ధి చెందిన దేశాలతో వ్యవహరించడానికి సిద్ధంగా ఉంటుంది” అని గోయల్ తెలిపారు.