అక్షరటుడే, కామారెడ్డి: Minister Seethakka | అధికారులపై ఎమ్మెల్యేలు ప్రతి విషయంలో ఫిర్యాదు చేస్తున్నారని.. వారు పనితీరు మార్చుకుని ఎమ్మెల్యేలతో కలిసి ముందుకు వెళ్లాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అధికారులతో మంత్రి సీతక్క మంగళవారం సమీక్ష నిర్వహించారు. అంతకుముందు మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన వనమహోత్సవం (vana mahotsavam) కార్యక్రమంలో మంత్రి పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం సమీక్షలో మాట్లాడుతూ.. గ్రామాల్లో వాటర్ ట్యాంకులు 15 రోజులకు ఒకసారి శుభ్రం చేయాలని, పైప్‌లైన్ లీకేజీలను అరికట్టాలన్నారు.
Minister Seethakka | జీపీ కార్యదర్శులపై ఫిర్యాదులు..

జీపీ హెడ్ క్వార్టర్స్‌లో పంచాయతీ కార్యదర్శులు ఉండడం లేదని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కార్యదర్శులు స్థానికంగా ఉండి ఉదయాన్నే పంచాయతీ సిబ్బందిని పర్యవేక్షిస్తే ఏ సమస్య ఉండదని ఆయన పేర్కొన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి ఒకే చోట పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేయాలని సూచించారు. దీనిపై మంత్రి సీతక్క స్పందిస్తూ కలెక్టర్ స్థాయిలో కార్యదర్శులను బదిలీ చేసే అవకాశాలున్నాయన్నారు.
Minister Seethakka | వాటర్‌ట్యాంక్‌లు క్లీన్ చేయట్లేదు..

జిల్లావ్యాప్తంగా వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలని మంత్రి సూచించారు. సీజనల్ వ్యాధులు రాకుండా గ్రామాల్లో చర్యలు తీసుకోవాలన్నారు. తన నియజకవర్గంలో ఏ గ్రామంలో కూడా వాటర్ ట్యాంకులు శుభ్రం చేయట్లేదని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావు (Jukkal MLA Laxmikant Rao) మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సర్పంచ్‌లు లేక అధికారుల పర్యవేక్షణ లేక గ్రామాల్లో పారిశుధ్యం లోపించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దీంతో మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ఎంపీడీవోలు, మండలస్థాయి అధికారులతో వాట్సాప్ గ్రూప్‌లు తయారుచేయాలని.. ఎమ్మెల్యేలను అందులో చేర్చాలని సూచించారు.
Minister Seethakka | వైద్యుల కొరత వేధిస్తోంది..

వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాదులు ప్రబలే అవకాశాలు ఉన్నాయని, వైద్యాధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు. ఎర్రపహాడ్ ఆస్పత్రిలో (Yerrapahad Hospital) మందుల కొరత ఉందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు (Yella Reddy MLA Madan Mohan Rao) తెలిపారు. ఎల్లారెడ్డి ఆస్పత్రిలో గైనిక్ వైద్యులు లేక గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే పేర్కొనగా సూపరింటెండెంట్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. నోటిఫికేషన్ ఇచ్చినా ఎవరూ రావట్లేదని బదులిచ్చారు. మద్నూర్ ఆస్పత్రిలో కరెంట్ లేక ఆక్సిజన్ ప్లాంట్ పని చేయడం లేదని, వెంటనే ఒక ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోరారు.
Minister Seethakka | ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తిచేయాలి..
ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తిచేస్తేనే కొత్త వాటి మంజూరుకు అవకాశం ఉంటుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణ పనులు ఇంకా జరుగుతున్నాయని హౌసింగ్ అధికారి విజయ్‌పాల్ పేర్కొనగా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇళ్లకు ఇసుక కొరత ఉండవద్దని సూచించారు. విడతల వారీగా పూర్తయిన ఇళ్లకు పేమెంట్ చేయడం లేదని ఎమ్మెల్యే పోచారం తెలిపారు. తాను ప్రతిరోజూ ఇళ్ల నిర్మాణాల వద్దకు వెళ్తానన్నారు. గ్రౌండ్ లెవల్లో అధికారులు పర్యటించడం లేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత ఉందని ఎమ్మెల్యేలంతా మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయమై తాను మంత్రి పొంగులేటితో మట్లాడతానన్నారు.
Minister Seethakka | ఇంకా ఎన్ని రోజులు కడతారు..?
మహిళా శక్తి భవన నిర్మాణంపై మంత్రి సంబంధిత అధికారులను మంత్రి ప్రశ్నించారు. ఇంకా పూర్తి కాలేదని చెప్పడంతో అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. భవన నిర్మాణానికి ఇంకా ఎన్నిరోజులు పడుతుందని ప్రశ్నించారు. ఇప్పటికే డబ్బులు కూడా ఇచ్చామని తెలిపారు. జిల్లాలో అంగన్వాడీ భవనాల నిర్మాణాలు కూడా పూర్తి కాకపోవడం పట్ల మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఒక్కో భవనానికి రూ.12 లక్షలు ఇస్తున్నా ఇంకా పనులు పూర్తి చేయకపోవడానికి ఇబ్బందేమిటని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా 12వేల అంగన్వాడీలకు భవనాలు లేవన్నారు. ఏడాదికి 2, 3 వేల చొప్పున పూర్తిచేసేలా ప్రణాళిక చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో 14,500 అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు మంత్రి తెలిపారు.

పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరిస్తున్న జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క