అక్షరటుడే, న్యూఢిల్లీ: May month | మే నెల అనగానే ఎవరికైనా విపరీతమైన ఎండ, ఉక్కపోత గుర్తుకొచ్చి అప్పుడే దడ పుడుతుంది. దీనికి అనుగుణంగానే భారత వాతావరణ విభాగం (IMD) India Meteorological Department కీలక అప్డేట్ ఇచ్చింది. మే నెలలో ఈసారి భారత్లోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.
కాగా, అడపాదడపా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురడం వల్ల కొంతమేర వేడి నుంచి ఉపశమనం లభిస్తుందని ఐఎండీ పేర్కొంది. అడపాదడపా కురిసే వర్షాలు.. ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయికి చేరకుండా నిరోధిస్తాయని వెల్లడించింది.
మే నెలలో ఈసారి వడగాలులు కాస్త ఎక్కువ రోజుల పాటు కొనసాగుతాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర పేర్కొన్నారు. రాజస్థాన్, హరియాణా, పంజాబ్, గుజరాత్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, బెంగాల్, ఉత్తర కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలలో వడగాలులు ఈసారి సాధారణం కంటే ఎక్కువగా కొనసాగుతాయని వివరించారు.
వాయవ్య, మధ్య, ఈశాన్య భారత్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో మే నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని మోహపాత్ర తెలిపారు. ‘ఉత్తర భారత్లో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందన్నారు. ఇక్కడ దీర్ఘకాలిక సగటు వర్షపాతం 64.1 మి.మీ. కాగా, ఈసారి 109 శాతం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదు కావొచ్చని మృత్యుంజయ్ వెల్లడించారు.