అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tamil Nadu | తమిళనాడు (Tamil Nadu)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. డీజిల్ లోడ్‌తో వెళ్తున్న గూడ్స్ రైలు (Goods Train)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే అన్ని బోగీలకు మంటలు వ్యాపించడంతో దట్టమైన పొగ అలుముకుంది. ఈ క్రమంలో అధికారులు ఆ మార్గంలో పలు రైళ్లను రద్దు చేశారు.
చెన్నై ఓడరేవు నుంచి ఆయిల్ తరలిస్తున్న రైలు తిరువళ్లూరు (Thiruvallur) పట్టణ సమీపంలోకి రాగానే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పోర్టు నుంచి చమురుతో వెళ్తున్న రైలు పట్టాలు తప్పడంతో మంటలు చెలరేగినట్లు సమాచారం. దీంతో మంటలు అన్ని బోగీలకు వ్యాపించాయి. భారీగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి.
Tamil Nadu | మంటలు ఆర్పుతున్న పది ఫైరింజన్లు
అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. పది ఫైర్ ఇంజిన్ల(Fier Engines)తో మంటలను ఆర్పుతున్నారు. అయితే రైలులో ఇంధనం ఉండటంతో మంటలు మరింత వ్యాపించే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. అగ్ని ప్రమాదం నేపథ్యంలో అరక్కోణం మీదుగా వచ్చే రైళ్లను అధికారులు నిలిపివేశారు. పలు రైళ్లను దారి మళ్లించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Tamil Nadu | స్థానికుల తరలింపు
గూడ్స్ రైలులో మంటలు చెలరేగడంతో పట్టాలకు ఇరువైపులా ఉన్న స్థానికులను సైతం అధికారులు అక్కడి నుంచి తరలించారు. దాదాపు 300 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తిరువళ్లూరు జిల్లా యంత్రాంగం, రైల్వే అధికారులు ఘటన స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.