అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mumbai Train Blasts Case | ముంబై రైలు పేలుళ్ల కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పును సవాల్ చేస్తూ మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) మంగళవారం సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించింది.
ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని మహారాష్ట్ర ప్రభుత్వం(Maharashtra Government) తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా న్యాయస్థానాన్ని కోరారు. అందుకు అంగీకరించిన చీఫ్ జస్టిస్ BR గవాయ్, జస్టిస్ K వినోద్ చంద్రన్, NV అంజరియాలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపడతామని ప్రకటించింది.
2006 ముంబై రైలు పేలుళ్ల కేసులో (Mumbai Train Blasts Case) నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు సోమవారం సంచలన తీర్పునిచ్చింది. సరైనా సాక్ష్యాధారాలు లేవంటూ 12 మంది నిందితులను విడుదల చేయాలని ఆదేశించింది. భారతదేశంలో ఇటీవలి చరిత్రలో అత్యంత ఘోరమైన ఉగ్రవాద దాడులలో ఒకటైన ఈ దాడుల్లో హైకోర్టు తీర్పు తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే ఏటీఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Mumbai Train Blasts Case | పేలుళ్లలో 189 మంది మృతి..
2006లో ముంబై సబర్బన్ రైళ్లను లక్ష్యంగా చేసుకుని జరిగిన వరుస పేలుళ్లలో 189 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 800 మందికి పైగా గాయపడ్డారు. జులై 11, 2006న ముంబై లోకల్ రైళ్లలో ఏడు బాంబు పేలుళ్లు సంభవించాయి. వెస్ట్రన్ రైల్వే లైన్‌లోని వివిధ స్టేషన్‌లలో ఈ పేలుళ్లు జరిగాయి. 19 ఏళ్ల క్రితం ముంబై వెస్ట్రన్ రైల్వే నెట్‌వర్క్‌ను గడగడలాడించిన ఈ దాడిలో 189 మంది ప్రాణాలు కోల్పోగా, వందల మంది గాయపడ్డారు. అప్పట్లో దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఉదంతంపై ఏటీఎస్ సుదీర్ఘ దర్యాప్తు చేపట్టింది. 2015లో ప్రత్యేక కోర్టు 12 మందిని దోషులుగా తేల్చి, ఐదుగురికి మరణశిక్ష, మిగిలిన ఏడుగురికి జీవిత ఖైదు విధించింది.
Mumbai Train Blasts Case | నిర్దోషులుగా ప్రకటించిన హైకోర్టు..
ప్రత్యేక కోర్టు విధించిన శిక్షను సవాల్ చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను సుదీర్ఘంగా విచారించిన బాంబే హైకోర్టు (Bombay High Court) సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 12 మందిని హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించి, వారి శిక్షలను రద్దు చేసింది. ప్రాసిక్యూషన్ అందించిన సాక్ష్యాలు నిందితులను దోషులుగా నిరూపించడంలో పూర్తిగా విఫలమయ్యాయని జస్టిస్ అనిల్ కిలోర్, జస్టిస్ శ్యామ్ చందక్‌లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం తేల్చింది. నిందితులు నేరం చేశారని నమ్మడం కష్టమని ప్రాసిక్యూషన్ ఈ కేసును నిరూపించలేకపోయింది. అందువల్ల, వారి శిక్షను రద్దు చేస్తూ, వారిని నిర్దోషులుగా ప్రకటిస్తున్నామని కోర్టు స్పష్టం చేసింది.
కానీ తాజాగా హైకోర్టు మాత్రం ఈ శిక్షలను రద్దు చేస్తూ, ఐదుగురికి విధించిన మరణశిక్ష, ఏడుగురికి విధించిన జీవిత ఖైదును కొట్టివేసింది. వారు ఇతర కేసులో నిందితులుగా లేకపోతే, వెంటనే జైలు నుంచి విడుదల కావాలని కోర్టు ఆదేశించింది. ఈ తీర్పుపై మహారాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీన్ని సుప్రీంలో సవాల్ చేస్తామని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సోమవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏటీఎస్ మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.