అక్షరటుడే, వెబ్‌డెస్క్: Heavy Rains | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన (LPA) ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జులై 21 నుంచి 26 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయన్నారు.
ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయి. వర్షాల ప్రభావంతో గోదావరి నదికి (Godavari River) జులై 27 నుంచి 30 మధ్య భారీ వరద వచ్చే అవకాశం ఉంది.
ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట, జనగామ, సూర్యపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయి. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. జులై 23 నుంచి 26 వరకు వాతావరణం చల్లబడి, ముసురు పడుతుందని పేర్కొన్నారు. ఆరు రోజుల పాటు హైదరాబాద్ (Hyderabad) నగరంలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.
Heavy Rains | రైతుల హర్షం
రాష్ట్రంలో మూడు రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటి వరకు వానలు లేకపోవడంతో రైతులు (Farmers) ఆందోళన చెందారు. వానాకాలం సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి మొన్నటి వరకు భారీ వానలు పడలేదు. దీంతో చెరువుల్లోకి నీరు రాలేదు. వాగులు పారలేదు. భూగర్భ జలాలు సైతం పెరగక పంటలు ఎండుతున్న క్రమంలో వర్షాలు పడ్డాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో వాగులకు జలకళ వచ్చింది. చెరువుల్లోకి కొత్త నీరు వచ్చిచేరుతోంది. దీంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.