అక్షరటుడే, వెబ్‌డెస్క్: High Court | పెరుగుతున్న సాంకేతికతకు అనుగుణంగా న్యాయవ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. న్యాయవాదులు, కక్షిదారుల సౌకర్యార్థం వర్చువల్ విచారణలను కూడా కోర్టులు చేపడుతున్నాయి. అయితే వీటిని పలువురు దుర్వినియోగం చేస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తి వాష్ రూమ్‌లో కూర్చొని కోర్టు విచారణకు హాజరైన వీడియో వైరల్ (Viral Video) అయిన విషయం తెలిసిందే. తాజాగా ఏకంగా న్యాయవాదే బీరు తాగుతూ వాదనలు వినిపించడం గమనార్హం.
High Court | చర్యలకు సిద్ధమైన ధర్మాసనం
బీరు తాగుతూ క్లయింట్ తరఫున వర్చువల్‌గా వాదనలు వినిపించిన న్యాయవాదిపై గుజరాత్ హైకోర్టు (Gujarat High Court) చర్యలకు సిద్ధమైంది. జూన్ 26న జస్టిస్ సందీప్ భట్ ఓ కేసు విచారణ చేపడుతున్నారు. ఈ క్రమంలో పిటిషనర్ తరఫున న్యాయవాది భాస్కర్ తన్నా వర్చువల్‌గా వాదనలు వినిపించారు. అయితే ఆ సమయంలో ఆయన బీరు తాగుతూ వాదనలు కొనసాగించడం గమనార్హం.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అయింది. దీంతో న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భాస్కర్‌కు సీనియర్ న్యాయవాది (senior advocate Bhaskar) హోదాను పునఃపరిశీలిస్తామని పేర్కొంది. ఇక నుంచి ఆయన వర్చువల్‌గా వాదనలు వినిపించడానికి కుదరదని స్పష్టం చేసింది. ఆయనపై సుమోటాగా కేసు స్వీకరించిన న్యాయస్థానం రెండు వారాల తర్వాత వాదనలు వింటామని తెలిపింది. ఆలోగా భాస్కర్ శైలిపై నివేదిక సిద్ధంచేసి సమర్పించాలని రిజిస్ట్రీని ఆదేశించింది.