అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vijay Mallya | భారతదేశం నుంచి పారిపోయిన లలిత్ మోదీ (Lalit Modi), విజయ్ మాల్యా లండన్‌లో ఓ గ్రాండ్ పార్టీ నిర్వహించుకుంటూ పాటలు పాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media) దుమారం రేపుతోంది. ఐపీఎల్‌ను స్థాపించిన లలిత్ మోదీ, బ్యాంకుల్ని ముంచి దేశం విడిచి వెళ్లిన విజయ్ మాల్యా (Vijay Mallya) ఇద్దరూ కలిసి ప్రముఖ క్రికెటర్ క్రిస్ గేల్ (Cricketer Chris Gayle)తో కలిసి పార్టీని తెగ ఎంజాయ్ చేశారు. ఈ ముగ్గురూ కలిసి పాడిన “I Did It My Way” పాట ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Vijay Mallya | ఎంత దారుణం..
లండన్ లోని బెల్‌గ్రేవియాలో ఉన్న తన విలాసవంతమైన నివాసంలో లలిత్ మోదీ ఏటా నిర్వహించే వేసవి పార్టీలో ఈ సన్నివేశం చోటు చేసుకుంది. స్వయంగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పోస్ట్ (Instagram video post) చేయగా, క్రిస్ గేల్ కూడా తన సోషల్ మీడియా ఖాతాలో ఫొటోలు షేర్ చేశారు.
ఈ పార్టీకి 310 మందికి పైగా అతిథులు హాజరైనట్టు సమాచారం. పార్టీ సందర్భంగా ఏర్పాటు చేసిన కారోకే సెషన్‌లో మోదీ, మాల్యా, గేల్ ముగ్గురూ కలిసి ఫ్రాంక్ సినాట్రా ప్రసిద్ధ పాట “I Did It My Way” పాడారు. వీడియోలో ముగ్గురూ నవ్వుతూ, గానం చేస్తూ, సరదాగా గడిపిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పార్టీకి సంబంధించిన వీడియో షేర్ చేస్తూ లలిత్ మోదీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ వీడియో ఇంటర్నెట్‌ను బ్రేక్ చేయదని ఆశిస్తున్నానంటూ కామెంట్ పెట్టారు. అయితే చట్టాన్ని ఉల్లంఘించిన వారు విదేశాల్లో ఇలా హ్యాపీ జీవించడమే కాక, ప్రజల ముందే తమ లైఫ్ స్టైల్‌ను చూపించడం అనేది పెద్ద ప్రశ్నగా మారింది.
“దేశాన్ని మోసం చేసినవారు విదేశాల్లో పాటలు పాడుతూ పార్టీలు చేసుకుంటే, పేదవాడు ఒక్క వంద రూపాయల కంటే ఎక్కువ తీసుకున్నా జైలు శిక్ష.. ఇదెక్కడి న్యాయం?” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.
కాగా, ఐపీఎల్ వ్యవస్థాపక చైర్మెన్‌గా (founding chairman of IPL) ఉన్న లలిత్ మోదీ.. ఆ తర్వాత ఆయనపై పలు ఈడీ కేసులు నమోదు కావడంతో దేశం విడిచి వెళ్లారు. అతన్ని అప్పగించాలని భారత్ అనేక సందర్భాల్లో బ్రిటన్‌ను కోరినప్పటికీ ఫలితం లేదు. అతను ఇప్పటికీ బ్రిటీష్ రెసిడెంట్‌గానే కొనసాగుతున్నారు.