అక్షరటుడే, వెబ్‌డెస్క్: Local Body Elections | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు (local body elections) త్వరలో నగరా మోగనుంది. సెప్టెంబర్ 30లోపు పంచాయతీ ఎన్నికలు (panchayat elections) నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల (BC reservations) అంశంపై ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆమోదానికి పంపిన సర్కారు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయా శాఖలను ప్రభుత్వం ఆదేశించింది.
Local Body Elections | త్వరలో ఎన్నికలు
రాష్ట్రంలో పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం 2024 ఫిబ్రవరిలో ముగిసింది. అప్పటి నుంచి సర్పంచులు లేక గ్రామాల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది. మరోవైపు ఎంపీటీసీలు, జెడ్పీటీసీల (MPTCs and ZPTCs) పదవీ కాలం ముగిసి కూడా ఏడాది దాటింది. మున్సిపాలిటీల్లో కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధం అవుతోంది.
బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌కు (BC reservation ordinance) గవర్నర్ ఆమోదం తెలిపితే స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇప్పటికే ఆ ఆర్డినెన్స్ రాజ్‌భవన్‌కు చేరడంతో రెండు మూడు రోజుల్లో ఆమోదం లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Local Body Elections | ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల ఖరారు
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల నిర్వహణకు వేగం పెంచింది. ఇందులో భాగంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీ స్థానాలను తాజాగా ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 31 జెడ్పీ చైర్పర్సన్లు, 566 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నట్లు ప్రకటించింది. అలాగే 566 ఎంపీపీలు, 5773 ఎంపీటీసీలు ఉన్నట్లు వివరాలు వెల్లడించింది. నల్గొండలో అత్యధికంగా 33 మంది జెడ్పీటీసీలు, నిజామాబాద్ 31 మంది జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి.
అత్యధికంగా నల్గొండ జిల్లాలో (Nalgonda district) 353 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. అత్యల్పంగా ములుగు జిల్లాలో 83 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలు ఉండగా.. 31 జిల్లా పరిషత్‌లు ఉన్నాయి. హైదరాబాద్, మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు లేవు. ఆయా జిల్లాల్లోని ప్రాంతాలు మొత్తం మున్సిపాలిటీల పరిధిలో ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో 12,778 గ్రామ పంచాయతీలు, 1.12 లక్షలు వార్డులు ఉన్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.