అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Local Body Elections | రాష్ట్ర కేబినేట్ (State Cabinet) కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రకటించింది.
గురువారం సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. అనంతరం భేటీలో చర్చించిన అంశాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) మీడియాకు వెల్లడించారు.
ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కులగణన పక్కాగా చేశామని పేర్కొన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ (BC Reservations) ఇస్తామని గతంలో హామీ ఇచ్చామని మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు పెట్టి కేంద్రానికి పంపించామన్నారు. అయితే కేంద్రం బిల్లుకు ఆమోదం తెలపడం లేదని.. అయినప్పటికీ న్యాయపరంగా చిక్కులు లేకుండా స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని కేబినెట్లో నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. దీనికోసం 2018లో తీసుకొచ్చిన చట్టాన్ని కూడా సవరిస్తామన్నారు.
Local Body Elections | 25న మళ్లీ కేబినెట్ భేటీ
ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 19 మంత్రివర్గ సమావేశాలు నిర్వహించిందన్నారు. గతంలో నిర్వహించిన 18 కేబినెట్ మీటింగ్‌లలో 321 నిర్ణయాలు తీసుకున్నామన్నారు. ఆ నిర్ణయాల అమలుపై దేశంలో ఎక్కడా లేనివిధంగా గురువారం చర్చించామన్నారు. కేబినెట్ గతంలో చర్చించిన 96శాతం పనులు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. రెండు వారాలకోసారి కేబినెట్ సమావేశం నిర్వహించాలని గతంలో సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా 25న మళ్లీ కేబినెట్ సమావేశం నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
Local Body Elections | రెండు యూనివర్సీటీల ఏర్పాటుకు ఆమోదం
రాష్ట్రంలో రెండు యూనివర్సిటీల ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు పొంగులేటి తెలిపారు. అమిటీ యూనివర్సిటీ (Amity University), సెంట్ మేరీ విద్యా సంస్థలకు కూడా యూనివర్సిటీగా ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. అమిటీ యూనిర్సిటీలో తెలంగాణ విద్యార్థులకు 50శాతం సీట్లు కేటాయించేలా ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా గోశాలల ఏర్పాటుకు కూడా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్షణ్ పాల్గొన్నారు.