అక్షరటుడే, వెబ్‌డెస్క్:Teenmar Mallanna | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బీసీల గురించి, బీసీల భాష గురించి ఏం తెలుసని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) అలియాస్ చింతపండు నవీన్ ప్రశ్నించారు.
బీసీల రిజర్వేషన్లు తగ్గించింది కేసీఆరేనని, ఆ విషయాన్ని కవిత గుర్తుంచుకుంటే మంచిదని, చిల్లర మల్లర పనులు మానుకోవాలని సూచించారు. తనపై గూండాలతో దాడులకు పాల్పడిన కవిత ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు సోమవారం శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని (Gutta Sukhender Reddy) కలిసిన తీన్మార్ మల్లన్న ఆమెపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
Teenmar Mallanna | తప్పుగా అర్థం చేసుకున్నారు..
ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)పై చేసిన వ్యాఖ్యలను తీన్మార్ మల్లన్న సమర్థించుకున్నారు. కంచం పొత్తు, మంచం పొత్తు అనడానికి తెలంగాణ(Telangana)లో వేరే అర్థంలో వాడుతారని చెప్పారు. ‘కంచం పొత్తు – మంచం పొత్తు’ అంటే బీసీల భాషలో వియ్యం పొత్తు అనే అర్థం వస్తుందని గుర్తుచేశారు. వాళ్ల భాషలో ‘మంచం పొత్తు’ అంటే ఏంటో తనకు తెలియదని విమర్శించారు. 2017 తెలుగు మహాసభల సందర్భంగా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం (KCR Government) ఒక పుస్తకం ప్రచురించిందని.. ఆ పుస్తకానికి ముందుమాట రాసింది కేసీఆరేనని గుర్తుచేశారు. ఆ పుస్తకంలో ‘మంచం పొత్తు – కంచం పొత్తు’ అని ఉంటుందని వివరించారు. తెలుగు వ్యాకరణ భాషపై తనకు పట్టు ఉందని, ఏ పదాలు వాడాలి, ఏది వాడకూడదనేది తనకు తెలుసని చెప్పారు.
Teenmar Mallanna | బీసీ ఉద్యమంపై కుట్ర..
బీసీల ఉద్యమాన్ని ఆపాలనే కవిత కుట్ర చేస్తున్నారని మల్లన్న ఆరోపించారు. దొరసానికి బీసీల భాష ఏం తెలుసని విమర్శించారు. కవిత బీసీ(BC) వాదంపై దాడి చేస్తోందని ఆక్షేపించారు. కవితకు అధికారం పోయినా అహంకారం తగ్గడం లేదని మండిపడ్డారు. కవిత, ఆమె ప్రేరేపిత గుండాలు చేసిన అరాచకంపై మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డకి ఫిర్యాదు చేశానని, ఆమె కవిత సభ్యత్వాన్ని రద్దు కోరినట్లు తెలిపారు. దీనిపై విచారణ చేస్తామని గుత్తా సుఖేందర్ రెడ్డి హామీ ఇచ్చారని పేర్కొన్నారు.