అక్షరటుడే, ఇందూరు: Dengue | వర్షాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధులు ముసురుకుంటాయి. మరీ ముఖ్యంగా మలేరియా, టైఫాయిడ్, డెంగీ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పలువురు డెంగీ భారిన పడ్డారు. గత నెలలో సుమారు 40 మందికి డెంగీ వచ్చింది. ఆస్పత్రుల్లోనూ అనుమానితుల సంఖ్య పెరగడంతో డెంగీ నిర్ధారణ పరీక్షలు (Dengue diagnostic tests) చేస్తున్నారు.
నిజాంసాగర్ మండలం (Nizamsagar mandal) వడ్డేపల్లిలో 14 ఏళ్ల బాలుడికి శనివారం డెంగీ నిర్ధారణ అయింది. గత పది రోజులుగా తీవ్ర జ్వరం రావడంతో వైద్యుల సూచన మేరకు కుటుంబీకులు పరీక్షలు చేయించారు. డెంగీ సోకినట్లు గుర్తించారు. దీంతో శనివారం గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులతో పాటు పీహెచ్సీలలో జ్వర బాధితులు పెరుగుతున్నారు. శనివారం నిజామాబాద్ జీజీహెచ్లో వెయ్యికి పైగా ఓపీ నమోదైంది. ఇందులో ఎక్కువ శాతం జ్వరంతో బాధపడే వారే ఉన్నారు. దీంతో వైద్యులు మలేరియా, డెంగీ నిర్ధారణ పరీక్షలకు (malaria and dengue diagnostic tests) రిఫర్ చేస్తున్నారు. అలాగే ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ రోగుల సంఖ్య పెరగడంతో టెస్టుల పేరుతో అందిన కాడికి దండుకుంటున్నారు.
Dengue | ఇవీ డెంగీ లక్షణాలు..
డెంగీ హిమరేజిక్ ఫీవర్. దీని ప్రారంభ లక్షణాలు సాధారణ జ్వరం మాదిరిగానే ఉంటాయి. ఆ తర్వాత తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, దద్దుర్లు వంటివి వస్తాయి. అదే సమయంలో తీవ్రమైన కడుపునొప్పి పదేపదే వాంతులు, చిగుళ్లు లేదా ముక్కు నుంచి రక్తస్రావం, రక్తంతో వాంతులు చేసుకోవడం, అకస్మాత్తుగా రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి. L
Dengue | ప్రతి శుక్రవారం డ్రై డే..
వర్షాకాలం వ్యాధులు (rainy season diseases) ప్రబలకుండా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అధికారులు సైతం గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా ఇంటి ఆవరణలో నీరు నిల్వ ఉండకుండా చూడటం, నివాస, దుకాణ సముదాయాల్లో పరిశుభ్రత పాటించడంపై ప్రజలకు సూచనలు చేస్తున్నారు. పాత వస్తువులు, వ్యర్థాలు లేకుండా చూస్తున్నారు. అయితే గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నా పట్టణాలు, నగరాల్లో మాత్రం కాస్త వెనుకబడ్డారు. ప్రధానంగా నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్ లాంటి పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు, స్లమ్ ఏరియాల్లో మాత్రం ఫ్రైడే, డ్రైడేపై అవగాహన అంతంత మాత్రంగానే కనిపిస్తోంది.
Dengue | గత నెలలో భారీగానే..
గత నెలలో ఉమ్మడి జిల్లాలో భారీగానే డెంగీ కేసులు నమోదయ్యాయి. నిజామాబాదులో 25, కామారెడ్డిలో 14 మంది ఈ వ్యాధి బారినపడ్డారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యులు సూచిస్తున్నారు. కాగా.. ఈ నెలలో కామారెడ్డి జిల్లాలో (Kamareddy district) ఒక కేసు నమోదైంది. వైరల్ ఫీవర్ బారిన పడిన వారి సంఖ్య సుమారు 200 వరకు ఉంటారు. అయితే వర్షాలు మొదలైన నేపథ్యంలో సీజనల్ వ్యాధుల కేసులు మరింత పెరిగే అవకాశం ఉంది.
Dengue | ఇలా చేస్తే మేలు..
దోమలను నియంత్రించడం ద్వారా డెంగీ వ్యాప్తిని నివారించవచ్చు. గుంతల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చూడడం ద్వారా దోమలను నియంత్రించే అవకాశం ఉంటుంది. అలాగే దోమల నుంచి రక్షించుకోవడానికి నిండుగా దుస్తులు ధరించాలి. ఎక్కడ పడితే అక్కడ చెత్తను పాడేయకుండా డస్ట్‌బిన్‌లలో మాత్రమే వేయాలి. ప్రధానంగా దోమల వృద్ధి చెందకుండా అప్రమత్తంగా ఉండడం ద్వారా డెంగీ సోకకుండా చూసుకోవచ్చు. జ్వరం లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.