అక్షరటుడే, వెబ్‌డెస్క్: Costly Hand Bag | ఫ్యాషన్ ప్రపంచంలో అసాధారణ ఘట్టం నమోదైంది. బ్రిటిష్ నటి, గాయని, ఫ్యాషన్ ఐకాన్ జేన్ బిర్కిన్ (Jane Birkin) ఉపయోగించిన హ్యాండ్‌బ్యాగ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్యాగ్‌గా గుర్తింపు పొందింది.
జేన్ బిర్కిన్ ఉపయోగించిన “బిర్కిన్ బ్యాగ్” తాజాగా 10 మిలియన్ డాలర్లకు (సుమారు ₹84 కోట్లు) సోథెబీస్ వేలం ద్వారా విక్రయమైంది. ఈ బ్యాగ్‌ను జేన్ బిర్కిన్ 1985 నుంచి 1994 వరకూ ప్రతిరోజూ వాడారు. మురికిగా, ముడతలుగా, గీతలతో కనిపించినప్పటికీ అందాల హాలీవుడ్ నటి వాడిన క్రేజ్ వల్లనో ఏమో కాని భారీ ధరకు అమ్ముడైంది.. బ్యాగ్‌పై చెక్కిన “J.B.” ఇనీషియల్స్, మెటల్ హుక్, నెయిల్ కటర్ వంటి ప్రత్యేక లక్షణాలన్నీ దీన్ని మరింత ప్రత్యేకంగా మార్చాయి. ఈ ప్రత్యేకమైన బ్యాగ్ వెనుక ఆసక్తికర కథ ఉంది.
Costly Hand Bag | అంత ధరనా..
1984లో జేన్ బిర్కిన్, హెర్మ్స్ ఛైర్మన్ జీన్-లూయిస్ డ్యూమాస్ ఒక విమానం(Flight)లో కలిసి ప్రయాణిస్తున్నారు. అయితే ఆ సమయంలో తన ముగ్గురు పిల్లల అవసరాలను తీర్చగల బ్యాగ్ తనకు ఎప్పుడూ దొరకలేదంటూ జేన్ చెప్పుకొచ్చింది. విమానం ఎక్కినప్పుడల్లా వాంతి చేసుకొనే కవర్‌లో వస్తువులు పెట్టుకోవాల్సి వస్తుందని చెప్పింది. అయితే మార్కెట్లో ఉన్న హ్యాండ్ బ్యాగ్ చిన్నవిగా ఉన్నాయి, కాస్త పెద్ద బ్యాగ్ తయారు చేయొచ్చు కదా అని బిర్కిన్ ఓ వ్యాపారిని కోరింది. వెంటనే అతను తన సంస్థలో ప్రఖ్యాత నిష్ణాతులతో నాణ్యమైన తోలు, పలు ప్రత్యేకతలతో పెద్ద బ్యాగ్ తయారు చేయించి 1985లో ఆమెకు గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ బ్యాగులను మీ పేరుతో అమ్ముకోవచ్చా అంటే అందుకు బిర్కిన్ సరే అంది. ఇక 1985 నుండి 1994 వరకు ఆమె ఎక్కువగా ఆ బ్యాగ్‌ను తనతో తీసుకు వెళ్లేది.
ఈ బ్యాగ్ తర్వాత మరో నాలుగు బ్యాగ్‌లని బిర్కిన్ బహుమతిగా అందుకుంది. రాను రాను బ్యాగు ధర అమాంతం పెరిగింది. అత్యంత సంపన్నులు మాత్రమే కొనగలిగే బ్యాగ్‌గా అది మారింది. అయితే బ్యాగ్ కోసం సోథెబీస్ నిర్వహించిన వేలం 10 నిమిషాలపాటు సాగగా, దీని కోసం 9 మంది కలెక్టర్లు పోటీ పడ్డారు. చివరికి ఓ జపనీస్ కలెక్టర్ గెలిచి ఈ చారిత్రాత్మక బ్యాగ్‌ను సొంతం చేసుకున్నారు.
సోథెబీస్ హ్యాండ్‌బ్యాగ్(Sothebys Handbag) నిపుణుడు మోర్గాన్ హలిమి(Morgan Halimi) మాట్లాడుతూ, ఇది.. ఫ్యాషన్ ప్రపంచంలో చారిత్రాత్మక మైలురాయి అని అన్నారు. ఇక బిర్కిన్‌కి గోళ్లు కత్తిరించుకునే అలవాటు ఉంది. అందుకోసం కంపెనీ ఆ బ్యాగ్‌కు వెండి గోళ్ల కత్తెరను తగిలించింది. జిప్ లాక్ కోసం బుల్లి తాళం కూడా ఇచ్చారు. అయితే బిర్కిన్ 2023లో చనిపోగా, అంతకముందు ఓ సారి మీడియాతో మాట్లాడుతూ నేను చనిపోయాక నా సినిమాలు, సాయం గురించే కాకుండా నా బ్యాగ్ గురించి కూడా జనాలు మాట్లాడుకుంటే ఎంత బాగుంటుందో అని చెప్పుకొచ్చారు.
అయితే జేన్ బిర్కిన్ గాయనిగా, ఫ్యాషన్ డిజైనర్‌గా, సామాజిక కార్యకర్తగా, ఇలా ప్రతి రంగంలో తనదైన ముద్ర వేసింది. 1946 డిసెంబర్ 14న లండన్‌లోని మేరీలీబాన్‌లో జన్మించిన జేన్.. 76వ ఏట పారిస్‌లో తుది శ్వాస విడిచారు.