అక్షరటుడే, వెబ్‌డెస్క్: India Vs Bangladesh Series | బంగ్లాదేశ్‌లో భారత క్రికెట్ జట్టు పర్యటన రద్దయ్యే పరిస్థితి నెలకొంది. రెండు దేశాల నడుమ కొంతకాలంగా దౌత్య సంబంధాలు దిగజారడమే అందుకు కారణం. ఆగస్టు రెండో వారంలో భారత జట్టు బంగ్లా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ(Anderson-Tendulkar Trophy) ముగిసిన తర్వాత, భారత జట్టు బంగ్లాదేశ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లలో తలపడాల్సి ఉంది. ఆగస్టు 17, 20, 23 తేదీల్లో వన్డేలు జరగాల్సి ఉండగా, ఆగస్టు 26, 29, 31 తేదీల్లో టీ20 మ్యాచ్‌లు నిర్వహించాలని తొలుత షెడ్యూల్ నిర్ణయించారు.
India Vs Bangladesh Series | దిగజారిన దౌత్య సంబంధాలు..
అయితే, బంగ్లాదేశ్(Bangladesh), ఇండియా(India) మధ్య ఈ సిరీస్ జరిగే పరిస్థితి కనిపించడం లేదు. రెండు జట్ల మధ్య వైట్-బాల్ సిరీస్‌కు చేపడుతున్న సన్నాహాలను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) నిలిపివేసింది. ప్రధానంగా ఇరు దేశాల మధ్య క్షీణిస్తున్న దౌత్య సంబంధాలే సిరీస్ నిలిపివేయడానికి కారణమని ప్రచారం జరుగుతోంది. వన్డే, టీ20 సిరీస్ మీడియా హక్కుల అమ్మకాలను బీసీబీ నిలిపి వేయడమే సిరీస్ రద్దు చేయడానికి లేదా వాయిదా వేయడానికి అతిపెద్ద సంకేతంగా భావిస్తున్నారు. దీనికి సంబంధించిన జులై 7న బిడ్డింగ్ జరగాల్సి ఉంది, ఫైనాన్షియల్ బిడ్డింగ్(Financial bidding) జులై 10న జరగాల్సి ఉంది. “మార్కెట్‌ను పరిశోధించడానికి కొంత సమయం తీసుకుంటాము. తొందరపడడంలో అర్థం లేదు. మేము వేర్వేరు కాంట్రాక్టులు ఇవ్వవచ్చు” అని BCB అధికారి ఒకరు క్రిక్‌బజ్ ద్వారా చెప్పినట్లు తెలిసింది.
India Vs Bangladesh Series | కేంద్రం పంపకపోవచ్చు..
మరోవైపు, బంగ్లాదేశ్ వైఖరి సరిగా లేకపోవడంతో టీమిండియాను ఆ దేశ పర్యటనకు పంపించడంపై కేంద్ర ప్రభుత్వం(Central Government) ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం మన జట్టును బంగ్లాదేశ్‌కు పంపడానికి అనుకూలంగా లేదు. అయితే, దీనిపై ఇరువైపులా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణిస్తున్నందున జట్టును పంపించవద్దని బీసీసీ(BCCI)కి ప్రభుత్వం సూచించినట్లు తెలిసింది. దీనిపై వారంలోపు నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు. “ఇండియా సిరీస్‌కు తేదీ ఇంకా నిర్ణయించలేదు. వారు ఆగస్టులో రావడం కష్టమని చెప్పారు. ఇది FTPలో భాగం” అని BCB అధికారి ఒకరి తెలిపారు.