అక్షరటుడే, వెబ్‌డెస్క్: Reliance Infrastructure | ధీరూబాయి అంబానీ సంతానంలో ఒకరేమో వ్యాపారాల నిర్వహణలో ఎవరెస్ట్ అంత ఎత్తుకు చేరితే.. మరొకరేమో అధ:పాతాళానికి పడిపోయారు. ఒకప్పుడు అత్యంత ధనవంతులలో ఒకరిగా నిలిచిన అనిల్(Anil) అంబానీ.. కంపెనీలు వరుసగా నష్టాల బాటలో పయనించడంతో క్రమంగా దివాలా అంచులకు చేరారు. ఒకానొక సమయంలో ప్రపంచ ధనవంతుల్లో ఆరో స్థానంలో ఉన్న ఆయన ఆర్థిక నిర్వహణ లోపాలు, అప్పుల భారంతో ఆర్థికంగా కుంగిపోయి 2020లో యూకే కోర్టు(UK Court )లో దివాలా ప్రకటించారు కూడా.. ఇక అనిల్ అంబానీ పని అయిపోయినట్లే అని అనుకుంటున్న తరుణంలో ఆయన మళ్లీ నిలదొక్కుకుంటున్నారు. రుణ భారాన్ని తగ్గించుకుంటూ కొత్త ప్రాజెక్టులు చేపడుతూ సత్తా చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కంపెనీల షేర్లు విశేషంగా రాణిస్తున్నాయి. రిలయన్స్ పవర్(Reliance power), రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ 52 వారాల గరిష్టాల వద్ద ట్రేడ్(Trade) అవుతున్నాయి.
Reliance Infrastructure | రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్..
అనిల్ అంబానీ గ్రూప్‌లో రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(Reliance Infrastructure) స్టాక్ దూసుకుపోతోంది. ఏడాదిలో 115 శాతం పెరిగిన ఈ స్టాక్ ధర గతనెల రోజుల వ్యవధిలోనే ఏకంగా 75 శాతం వరకు పెరగడం గమనార్హం. సోమవారం ఇంట్రాడే(Intraday)లో 5 శాతం పెరిగి రూ. 390.35 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ రక్షణ రంగంలో దూకుడుగా ముందుకు సాగుతుండడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. 155 ఎంఎం ఆర్టిలరీ మందుగుండు అభివృద్ధిలో ఈ కంపెనీ దేశంలో మొదటి ప్రైవేట్ సంస్థగా నిలిచింది. ఎయిర్ క్రాఫ్ట్(Aircraft) ప్రోగ్రామ్‌పైనా దృష్టి సారించింది. వచ్చే దశాబ్ద కాలంలో మన రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి రూ. 10 వేల కోట్ల ఆర్డర్లు పొందాలన్న లక్ష్యంతో సాగుతోంది. విమానాల నవీకరణ చేపట్టనున్న తొలి దేశీయ ప్రైవేట్ రంగ కంపెనీగానూ రిలయన్స్ ఇన్‌ఫ్రా నిలవనుంది. ఇలా పనితీరును మెరుగుపరచుకుంటుండడంతో ఈ కంపెనీ స్టాక్ విలువ పరుగులు తీస్తోంది.
Reliance Infrastructure | రిలయన్స్ పవర్..
కొత్త ప్రాజెక్టులను చేపట్టడంతోపాటు భాగస్వామ్యాలపై దృష్టి సారించడం, రుణ భారాన్ని తగ్గించుకోవడంతో ఈ కంపెనీ పనితీరు సైతం గణనీయంగా మెరుగుపడింది. ఈ కంపెనీ షేరు విలువ సోమవారం ఇంట్రాడేలో 3.6 శాతం పెరిగి రూ. 63.90 వద్ద ఉంది. 52 వారాల కనిష్ట విలువ రూ. 25.25 కాగా.. గరిష్ట విలువ రూ. 64.57 గా ఉంది. ఈ ఏడాది జనవరినుంచి ఇప్పటివరకు షేర్ ప్రైస్(Share price) రెట్టింపు కావడం గమనార్హం.