అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Old City | హైదరాబాద్ (Hyderabad)లోని పాతబస్తీలో ఇరాన్ సుప్రీం లీడర్ (Iran Supreme Leader) అయుతుల్లా ఖమేనీ పోస్టర్లు కలకలం రేపాయి. ఖమేనీతో పాటు హిజ్బుల్లా నెంబర్ 2 హసన్ నస్రల్లా ఫొటోలతో పాతబస్తీలో ఫ్లెక్సీలు వెలిశాయి. ఇటీవల ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య యుద్ధం జరిగిన విషయం తెలిసిందే.
ఆపరేషన్ రైజింగ్ లయన్ (Operation Rising Lion) పేరిట ఇజ్రాయెల్ (Israel) ఇరాన్‌లోని అణుస్థావరాలపై దాడులకు పాల్పడింది. అనంతరం ఇరాన్ సైతం ఇజ్రాయెల్‌పై ప్రతిదాడులు చేసింది. యుద్ధం తీవ్రమవుతున్న సమయంలో అమెరికా (America) సైతం ఎంటర్ అయి బంకర్ బస్టర్లతో ఇరాన్‌లోని అణు స్థావరాలను ధ్వంసం చేసింది. అనంతరం ఇరాన్–ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. అయితే ఈ యుద్ధంలో భారత్ తటస్థ వైఖరి తీసుకుంది. ఏ దేశానికి మద్దతు తెలపకుండా శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది.
Old City | భారీ బందోబస్తు
భారత్ తటస్థ వైఖరి తీసుకున్నా.. కాంగ్రెస్‌తో పాటు పలు విపక్షాలు యుద్ధం విషయంలో ఇజ్రాయెల్ వైఖరిని తప్పుపట్టాయి. ఇరాన్ ఇస్లాం దేశం కావడంతో ఇక్కడి ముస్లింలు కూడా టెల్అవీవ్ దాడులను ఖండించారు. తాజాగా ఖమేనీకి మద్దతుగా ఓల్డ్ సిటీలో ఫ్లెక్సీలు ఏర్పాటవడం గమనార్హం. డబీర్ పుర, దారుల్షిప్పాలో పోస్టర్లు ఏర్పాటు చేయడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మరోవైపు ఆదివారం మొహర్రం (Moharram) వేడుకల సందర్భంగా పాతబస్తీలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా దాదాపు 3 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.