అక్షరటుడే, వెబ్డెస్క్: Supreme Court | వాహన ప్రమాద బీమా పాలసీపై (vehicle accident insurance policy) దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. అతివేగం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాలకు సంబంధించి బీమా కంపెనీలు (insurance companies) పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వాహనం నడిపేటప్పుడు బాధ్యతతో వ్యవహరించకపోతే.. ప్రమాదాలే కాకుండా బీమా ప్రయోజనాలూ కోల్పోవాల్సి వస్తుందని వివరించింది. అధిక వేగంతో కారు నడుపుతూ ప్రమాదానికి గురైన కేసులో మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ.80 లక్షల పరిహారం అందించాలన్న పిటిషనర్ల అభ్యర్థనను జస్టిస్ పిఎస్ నరసింహ (Justice PS Narasimha), ఆర్ మహదేవన్(Justice R Mahadevan)లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది.
Supreme Court | అతివేగంగా వెళ్లి.. ప్రమాదానికి గురై..
కర్ణాటకకు చెందిన ఎన్ఎస్ రవీష్ (NS Ravish) తన కుటుంబంతో కలిసి 2014 జూన్ 18న మల్లాసంద్ర గ్రామం నుంచి అరసికెరె పట్టణానికి కారులో బయల్దేరాడు. ఆ సమయంలో మలనహళ్లి సమీపంలో అతివేగం కారణంగా వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రవీష్ అక్కడికక్కడే మరణించాడు. కారుకు ఇన్సూరెన్స్ ఉన్న నేపథ్యంలో తమకు బీమా పరిహారం రూ. 80 లక్షలు చెల్లించాలని రవీష్ భార్య, కొడుకు, తల్లిదండ్రులు కలిసి విజ్ఞప్తి చేశారు. అయితే, రవి మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కోర్టులో దాఖలు చేసిన చార్జ్ షీటులో అతను నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. దీంతో పరిహారం చెల్లించేందుకు బీమా సంస్థ (insurance company) నిరాకరించింది. మరోవైపు, మోటార్ యాక్సిడెంట్ ట్రిబ్యునల్ కూడా కుటుంబానికి పరిహారం ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో బీమా పరిహారం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు కర్ణాటక హైకోర్టును (Karnataka High Court) ఆశ్రయించారు. టైరు పేలినందువల్లే ప్రమాదం జరిగిందని వాదించారు.
అయితే, నిర్లక్ష్యంగా వాహనం నడిపినట్టు ఆధారాలు ఉండడంతో గతేడాది నవంబర్ 23న వారి విజ్ఞప్తిని తోసిపుచ్చింది. “మృతుడు అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల ప్రమాదం జరిగింది. అతను స్వయంగా హింసకు పాల్పడినందున, చట్టపరమైన వారసులు అతని మరణానికి ఎటువంటి పరిహారం పొందలేరు. లేకుంటే అది ఉల్లంఘనకు పాల్పడిన వ్యక్తి తన సొంత తప్పులకు పరిహారం పొందినట్లు అవుతుంది” అని హైకోర్టు (High Court) వ్యాఖ్యానించింది.
Supreme Court | సుప్రీం సంచలన తీర్పు..
హైకోర్టు తీర్పు (High Court verdict) నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని రవీష్ కుటుంబం సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను విచారించిన ధర్మాసనం.. సంచలన తీర్పు వెలువరించింది. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు బీమా డబ్బులు ఎలా చెల్లిస్తారని ప్రశ్నించింది. బీమా చేసినా కూడా జరిగిన ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణం అయితే సదరు కంపెనీలు బీమా డబ్బులు చెల్లించనక్కర్లేదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులో జోక్యం చేసుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. “హైకోర్టు జారీ చేసిన అభ్యంతరకరమైన తీర్పులో మేము జోక్యం చేసుకోము. అందువల్ల, స్పెషల్ లీవ్ పిటిషన్ను కొట్టివేస్తున్నాము” అని ధర్మాసనం పేర్కొంది.