అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad | ప్రస్తుతం యువత అందంగా కనిపించాలని కుతూహల పడుతున్నారు. ఇందులో భాగంగా పలువురు యువకులు తమ కండలు పెంచుకోవడానికి జిమ్‌కు వెళ్తుంటారు. అయితే జిమ్‌లో సాధన చేసి తెచ్చుకోవాల్సిన కండలను కొందరు పౌడర్లు, ఇంజెక్షన్లు తీసుకొని తెచ్చుకుంటున్నారు. తర్వాత వాటి సైడ్ ఎఫెక్ట్‌లతో అనారోగ్యాల బారిన పడుతున్నారు.
హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఎన్నో జిమ్‌లు ఉన్నాయి. అయితే చాలా మంది యువకులు సిక్స్ ప్యాక్ (Youth Six Pack), కండల కోసం నిత్యం జిమ్‌కు వెళ్తున్నారు. అయినా కానీ వారికి సిక్స్ ప్యాక్ రాకపోవడంతో కొందరు జిమ్ సెంటర్ల నిర్వాహకులు పౌడర్లు, ఇంజెక్షన్లు(Injections) ఇస్తున్నారు. ఎలాగైనా అందంగా కనిపించాలనే ఆశతో పలువురు యువత వీటిని తీసుకొని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఇంజెక్షన్లు అమ్ముతున్న ఇద్దరిని హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.
Hyderabad | 423 ఇంజెక్షన్లు స్వాధీనం
శరీర పెరుగుదల కోసం అక్రమంగా ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ఇద్దరిని టాస్క్‌ఫోర్స్(Task Force), చత్రినాక పోలీసులు (Chatrinaka Police) అరెస్ట్ చేశారు. వారి నుంచి 423 ఇంజెక్షన్లు, రెండు బైకులు, రెండు ఫోన్లు, రూ.9,430 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఫలక్‌నుమాలో నివసిస్తున్న మోడల్ మహమ్మద్ జుబేర్ (30) చెంగిచెర్లలో వైద్య పంపిణీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న వేలుదండి వినయ్ కుమార్ (43) గా గుర్తించారు.
Hyderabad | యువతే లక్ష్యంగా..
జుబేర్, వినయ్ కలిసి ఎలాంటి లైసెన్స్, ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇంజెక్షన్లను విక్రయిస్తున్నారు. ముఖ్యంగా జిమ్(Gym)కు వెళ్లేవారిని లక్ష్యంగా చేసుకుని వీటిని అమ్ముతున్నారు. మొదట జుబేర్ కూడా ఈ డ్రగ్‌కు బానిసయ్యాడు. అనంతరం వినయ్ కుమార్ ద్వారా దీనిని సేకరించి విక్రయించడం ప్రారంభించాడు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఉన్న కపిల్ గౌతమ్ నుంచి ఈ ఇంజెక్షన్లు కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న ఇంజెక్షన్ల విలువ రూ.5 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.