అక్షరటుడే, ఇందూరు: Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి కనిపించేలా క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని మున్సిపల్ పట్టణాలు, జీపీల్లో లబ్ధిదారుల వివరాలను రెండు రోజుల్లోగా పీఎం ఆవాస్ యోజన (PM Awas Yojana) గ్రామీణ పోర్టల్లో నమోదు చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకునేలా ప్రోత్సహించాలని, వారికి ఉచిత ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇళ్ల నిర్మాణాలకు సుముఖంగా లేని లబ్ధిదారుల నుంచి లిఖితపూర్వకంగా లేఖలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం జారీ చేసిన నూతన మార్గదర్శకాలను పాటిస్తూ.. అర్హులైన వారికి 15 రోజుల్లోపు డబుల్ బెడ్ రూమ్ (Double Bedroom Houses) ఇళ్లను కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Indiramma Housing Scheme | ఎంపీడీవోలపై ఆగ్రహం..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల విషయంలో అలసత్వం వ్యవహరిస్తున్న ఎంపీడీవోలపై (MPDO) కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహిస్తూ.. నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం దిశా నిర్దేశం చేస్తున్నప్పటికీ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిలదీశారు. ఇలాంటి వైఖరితో ఉంటే ఏ మాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు.
Indiramma Housing Scheme | వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలి..
వనమహోత్సవాన్ని (vana mahostsavam) జిల్లావ్యాప్తంగా విజయవంతం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. వర్షాల కోసం ఎదురు చూడకుండా, నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించేలా చూడాలన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులను, విద్యార్థులను, అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు. అలాగే సీజనల్ వ్యాధులు (Seasonal diseases) ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ అంకిత్, డీఆర్డీవో సాయాగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.