అక్షరటుడే, వెబ్‌డెస్క్:Indiramma Houses | సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకున్న లబ్ధిదారులకు ఊహించని రీతిలో ప్రభుత్వం(Government) షాక్ ఇచ్చింది. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సవాలక్ష కొర్రీలు పెట్టింది. 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోనే నిర్మాణం పూర్తి చేయాలన్న నిబంధన విధించింది. అంతకు మించి ఏ కాస్త ఎక్కువ ఉన్నా పథకం వర్తించదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.
Indiramma Houses | ఇవేం నిబంధనలు
గతంలో కేసీఆర్(KCR) డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల(Indiramma Houses) పథకానికి శ్రీకారం చుట్టింది. నియోజవకర్గానికి 3,500 చొప్పున ఇళ్లను నిర్మించనున్నట్లు ప్రకటించింది. సొంత జాగా ఉన్న పేదల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఎంపికైన లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి విడతల వారీగా రూ.5 లక్షలు అందజేస్తామని పేర్కొంది. అర్హులైన వారి పేర్లతో మొదటి విడత జాబితాను విడుదల చేసింది. అయితే, ఇళ్ల నిర్మాణ పనులు చేపడుతున్న క్రమంలో ప్రభుత్వం లబ్ధిదారులకు షాక్ ఇచ్చింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద కట్టే ఇల్లు 600 చదరపు అడుగులకు మించకూడదని తెలిపింది. అంతకు మించి ఏమాత్రం ఎక్కువగా ఉన్న లబ్ధిదారులను అనర్హులుగా ప్రకటించడంతో పాటు రూ.5 లక్షల సాయం అందించమని తేల్చి చెప్పింది. దీంతో ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన వారు లబోదిబోమంటున్నారు.
Indiramma Houses | పీఎం ఆవాస్ యోజన నిబంధనలే..
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ఆర్భాటంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఒక రకంగా కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగమే. పీఎం ఆవాస్ యోజన(PM Awas Yojana) కింద ఇస్తున్న నిధులను రేవంత్ సర్కారు ఇక్కడ ఇందిరమ్మ ఇళ్లకు మళ్లిస్తోంది. కానీ రాష్ట్రంలో పీఎం ఆవాస్ యోజన పేరు కాకుండా ఇందిరమ్మ ఇళ్ల పథకంగా అమలు చేస్తోంది. ప్రస్తుతం రేవంత్ సర్కారు(Revanth Government) పెట్టిన సవాలక్ష కండీషన్లు ఏవైతో ఉన్నాయో అవి పీఎం ఆవాస్ యోజనలో భాగంగా అమలవుతున్నవే. కేంద్ర ప్రభుత్వ పథకం పొందాలంటే కచ్చితంగా 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టాలి. అంతకు మించి ఒక్క అడుగు విస్తీర్ణం ఎక్కువైనా బిల్లులు మంజూరు కావు. ఇంటి నిర్మాణాన్ని క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు జీపీఎస్(GPS) ఆధారంగా కొలతలు నిర్వహించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. అన్ని సరిగ్గా ఉంటేనే కేంద్ర ప్రభుత్వం(Central Government) నిధులు మంజూరు చేస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేంద్రం డబ్బులు వినియోగిస్తుండడంతో.. కేంద్రం విధించిన నిబంధనలను కచ్చితంగా అమలు చేయాల్సి వస్తోంది.
Indiramma Houses | లబోదిబోమంటున్న లబ్ధిదారులు
ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం అమలుపై గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి(Minister Ponguleti) శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్(Video conference) ద్వారా సమీక్షించారు. 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోపే ఇళ్లు నిర్మించాలని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. అంతకు మించితే బిల్లులు మంజూరు కావని తేల్చి చెప్పారు. అలాగే, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని సూచించారు. అనర్హులను ఎంపిక చేస్తే ఇంటి నిర్మాణం మధ్యలో ఉన్నా పథకాన్ని నిలిపి వేస్తామని హెచ్చరించారు. మంత్రి ప్రకటన నేపథ్యంలో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. 600 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇల్లు నిర్మించిన లబ్ధిదారులను అనర్హులుగా ప్రకటిస్తుండడంతో వారు ఆందోళన చెందుతున్నారు.
Indiramma Houses | నిలిచిన బిల్లులు..
సొంత జాగాలో ఒక బెడ్రూం, హాల్, వంట గది కలిపి ఉన్నంతలో విశాలంగా కట్టుకుందామనుకున్న పేదలకు నిరాశే మిగులుతోంది. ప్రభుత్వం(Government) చెబుతున్న 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు గదులు, అది కూడా ఇరుకుగా కట్టుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు. ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలకు తోడు తాము కొంత వెచ్చించి కొంతలో కొంత అయినా కాస్త విశాలంగా ఇల్లు కట్టుకోవాలనుకున్న వారి ఆశలు గల్లంతయ్యాయి. అంగుళం ఎక్కువైనా బిల్లులు రావని ప్రభుత్వం స్పష్టం చేస్తుండడంతో లబ్ధిదారులు గందరగోళం చెందుతున్నారు. కొందరైతే ఇంటి నిర్మాణానికి వెనుకడుగు వేస్తున్నారు. ఇప్పటికే ఇల్లు నిర్మాణం ప్రారంభించిన వారు అయోమయంలో పడ్డారు. ప్రభుత్వం నుంచి మొదటి విడతలో రావాల్సిన రూ.లక్ష సాయం నిలిచిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. నిబంధనలు తమకు తెలియవని, ప్రభుత్వమే స్పందించి తమకు బిల్లులు మంజూరు చేయాలని కోరుతున్నారు.