అక్షరటుడే, వెబ్డెస్క్: IMF | ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాల్లో భారత్(Bharath) టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఐఎంఎఫ్(IMF) తాజా అంతర్జాతీయ ఆర్థిక నివేదికల ప్రకారం ఈ సంవత్సరంలో మనదేశ జీడీపీ(స్థూల జాతీయోత్పత్తి) వృద్ధి 6.8 శాతంగా ఉండనుంది. ఇది ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక వ్యవస్థలన్నింటికన్నా అధికం. భారతదేశం ఈ అసాధారణ ఆర్థిక వృద్ధి రేటు నమోదు చేయడానికి ప్రభుత్వం(Government) అమలు చేస్తున్న సంస్కరణలు, దేశం సాధిస్తున్న సాంకేతిక పురోగతితోపాటు యువ శ్రామిక శక్తి, విదేశీ పెట్టుబడులు కారణమని భావిస్తున్నారు.
భారత్ తర్వాతి స్థానంలో ఇండోనేషియా(Indonesia) ఉంది. ఆ దేశ జీడీపీ(GDP) వృద్ధి రేటు 5.1 శాతంగా ఉండవచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో రెండో స్థానంలో ఉన్న చైనా(China).. జీడీపీ వృద్ధి రేటులో మూడో స్థానంలో ఉంటుందని భావిస్తున్నారు. ఆ దేశ జీడీపీ 4.6 శాతం పెరగవచ్చని అంచనా వేశారు. 3.3 శాతంతో సౌదీ అరేబియా నాలుగో స్థానంలో, 3.2 శాతం వృద్ధితో నైజీరియా ఐదో స్థానంలో ఉన్నాయి.
IMF | ఆరో స్థానంలో అమెరికా..
ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా(America) జీడీపీ వృద్ధి రేటు 2.7 శాతం ఉండవచ్చని ఐఎంఎఫ్ అంచనా కట్టింది. 2.3 శాతం వృద్ధితో స్పెయిన్ ఏడో స్థానంలో, 2.2 శాతంతో బ్రెజిల్ ఎనిమిదో స్థానంలో, 2.1 శాతం పెరుగుదలతో ఆస్ట్రేలియా తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. దక్షిణ కొరియా(South korea), కెనడా 2 శాతం జీడీపీ వృద్ధి రేటుతో వరుసగా పది, పదకొండు స్థానాలలో నిలిచాయి. 1.6 శాతం జీడీపీ వృద్ధితో పన్నెండో స్థానంలో యునైటెడ్ కింగ్‌డమ్, 1.5 శాతంతో పదమూడో స్థానంలో సౌత్ ఆఫ్రికా ఉంటాయని ఐఎంఎఫ్ అంచనా. 1.4 శాతం వృద్ధి రేటుతో మెక్సికో, రష్యా(Russia)లు వరుసగా పద్నాలుగు, పదిహేను స్థానాలలో ఉంటాయి. 1.1 శాతం జీడీపీ పెరుగుదలతో జపాన్(Japan) పదహారో స్థానంలో, 0.8 శాతం పెరుగుదలతో ఫ్రాన్స్ పదిహేడో స్థానంలో, 0.7 శాతం పెరుగుదలతో ఇటలీ పద్దెనిమిదో స్థానంలో, 0.3 శాతం జీడీపీ వృద్ధి రేటుతో జర్మనీ(Germany) పందోమ్మిదో స్థానంలో నిలిచాయని ఐఎంఎఫ్ నివేదిక స్పష్టం చేస్తోంది.