అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hydraa | వర్షాకాలం వచ్చిందంటే చాలు హైదరాబాద్ (Hyderabad) నగరవాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతారు. చిన్న వర్షం పడ్డా నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునుగుతాయి. రహదారులపై నీరు నిలిచి గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ అవుతోంది. నాలాలు, చెరువుల ఆక్రమణతో ఈ దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా (Hydraa) నగరంలో వరద ముంపు నివారణ కోసం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా నాలాలపై ఆక్రమణలను తొలగిస్తోంది.
Hydraa | నాలాను పరిశీలించిన హైడ్రా కమిషనర్
మాసబ్ చెరువు – దిలావర్ఖాన్ – పెద్దఅంబర్‌పేట చెరువులను అనుసంధానం చేసే నాలాను ఒక మోడల్‌గా తీర్చిదిద్దుతామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydraa Commissioner Ranganath) తెలిపారు. మొత్తం 7.50 కిలోమీటర్ల మేర ఈ నాలా ఉందన్నారు. అయితే తగిన వెడల్పుతో నాలాను నిర్మిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవని చెప్పారు. రెవెన్యూ, GHMC, ఇరిగేషన్ శాఖలన్నింటితో సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యాచరణ నాలా విస్తరణకు ప్రణాళికను రూపొందిస్తామని ఆయన తెలిపారు.
మాసబ్ చెరువు(Masab Pond) – దిలావర్ఖాన్ చెరువుల మధ్య నాలా సరిగ్గా లేక అనేక కాలనీలు నీట మునుగుతున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో (MLA Malreddy Rangareddy) కలిసి కమిషనర్ బుధవారం పలు ప్రాంతాలను పరిశీలించారు.
Hydraa | పూర్తిస్థాయిలో అభివృద్ధి
చెరువుల మధ్య అనుసంధానంగా ఉన్న వరద కాల్వలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కమిషనర్ పేర్కొన్నారు. అలాగే చెరువుల ఆక్రమణ జరగకుండా చూడాలని ఆదేశించారు. చెరువుల్లో మట్టి పోసి నింపినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాసబ్ చెరువులో మట్టి పోసినవారిపై చర్యలుంటాయన్నారు. అనంతరం కర్మాన్‌ఘాట్, బడంగ్‌పేట ఏరియాల్లో నాలా విస్తరణకు ఉన్న ఆటంకాలను పరిశీలించారు. కర్మాన్‌ఘాట్ ప్రాంతంలోని ఉదయ్ నగర్ కాలనీలో నాలాను వెంటనే విస్తరించాలని హైడ్రా కమిషనర్ సూచించారు. అనంతరం ఆయన రావిర్యాల చెరువును పరిశీలించారు. చెరువు పైభాగంలో పలు ఇళ్లు నీట మునుగుతున్న నేపథ్యంలో అలుగులను పరిశీలించారు.