అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hydraa | మూడు రోజులుగా హైదరాబాద్ (Hyderabad) నగరంలో సాయంత్రం పూట భారీ వర్షం (Heavy Rain) కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలతో పాటు రహదారులు జలమయమై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో హైడ్రా (Hydraa) సిబ్బంది కీలక చర్యలు చేపట్టారు. మంగళవారం హైడ్రా సిబ్బంది లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టారు.
వర్షం పడితే వరద ముంచెత్తకుండా ఆర్‌యూబీలు, వంతెనలను పరిశీలించి ఎక్కడా నీరు నిల్వకుండా జాగ్రత్త పడుతోంది. నీరు వెళ్లేందుకు ఉన్న రంధ్రాలు మూసుకుపోవడంతో ఫ్లైఓవర్‌పై వరద పారిన విషయం తెలిసిందే. దీంతో హైడ్రా సిబ్బంది ఆ హోల్స్‌ను శుభ్రం చేశారు. కొండాపూర్‌లోని కొత్తగూడ వంతెన, అఫీజ్‌పేట్ వంతెనలపై ఉన్న రంధ్రాలన్నీ తెరిచారు. అలాగే నగరంలోని అన్ని వంతెనలపై నీరు నిల్వకుండా చర్యలు తీసుకున్నారు.
Hydraa | నాలాల్లో పూడికతీత
నాలాల్లో పూడిక పేరుకుపోవడంతో వరద నీరు సమీప కాలనీల్లోకి ప్రవేశిస్తోంది. దీంతో ఆయా కాలనీల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో హైడ్రా నాలాల్లో పూడికతీత పనులు సైతం చేపడుతోంది. మదీన గూడ దగ్గర నాలా క్లీనింగ్ పనులు చేశారు. ఆర్‌యూబీల వద్ద సంపులు నిర్మించి ఆటోమేటిక్‌గా నీటిని తోడే వ్యవస్థను ఏర్పాటు చేశారు. అవి కొన్నిచోట్ల పని చేయకపోవడంతో మరమ్మతులు చేపట్టారు. మంగళవారం మెహిదీపట్నం, మాదాపూర్ ప్రాంతాల్లో వర్షం (Rain) పడుతున్నప్పుడు హైడ్రా ఎమర్జెన్సీ, డీఆర్ఎఫ్ బృందాలు క్షేత్రస్థాయిలో ఉండి.. వరద నిల్వకుండా చర్యలు తీసుకున్నాయి. అలాగే చింతల్, ఎల్‌బీనగర్ ఆర్‌యూబీలను హైడ్రా అధికారులు పరిశీలించారు.