అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad) నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydraa Commissioner Ranganath) మంగళవారం పరిశీలించారు. బంజారాహిల్స్ (Banjara Hills) రోడ్డు నంబరు 12 వద్ద చింతలబస్తీ ఆరంభంలో ఉండే కల్వర్టును తనిఖీ చేశారు. ఈ కల్వర్టు 12 మీటర్ల విస్తీర్ణంలో ఉండగా.. చింతలబస్తీ వైపు కబ్జాలను తొలగించిన విషయం విదితమే. 6 మీటర్ల మేర కబ్జాకు గురవడంతో కల్వర్టు కింద భారీగా చెత్తపోగై వరద సాగడానికి వీలు లేని పరిస్థితి నెలకొంది.
అక్కడ చెత్తను తొలగించడానికి లాంగ్ ఆర్మ్ జేసీబీని వినియోగించిన తీరును పరిశీలించారు. ఇదే మాదిరి నగరంలోని ప్రధాన కల్వర్టుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని సూచించారు. అంతకు ముందు కృష్ణ నగర్ (Krishna Nagar)లో నాలాల తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద ముంచెత్తడానికి గల కారణాలను తెలుసుకున్నారు. వరద నివారణకు ఇటీవల కొత్తగా 3 మీటర్ల వెడల్పుతో నిర్మించిన వరద కాలువ మధ్యలో ఎందుకు ఆగిపోయింది అని అధికారులను ప్రశ్నించారు. కృష్ణానగర్ ప్రధాన దారిని దాటించడానికి ఉన్న అవరోధాలపై వాకబు చేశారు.
Hydraa Commissioner | హైడ్రా పనితీరు పరిశీలించిన కర్ణాటక బృందం
హైదరాబాద్లో హైడ్రా చేపట్టిన చెరువుల పునరుద్ధరణ పనులను కర్ణాటక ఇంజినీర్ల బృందం (Karnataka Engineers Team) మంగళవారం పరిశీలించింది. హైడ్రా వంటి వ్యవస్థ అన్ని రాష్ట్రాలకు అవసరం అని ఆ బృందం అభిప్రాయ పడింది. పూర్తిగా కనుమరుగైన, కాలుష్యం బారిన పడిన చెరువులను అభివృద్ధి చేస్తున్న తీరు బాగుందని బృందం సభ్యులు కొనియాడారు. చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూములను పరిరక్షించడం కత్తి మీద సాములాంటిదన్నారు. హైడ్రా వంటి వ్యవస్థను ఏర్పాటు చేసి సమస్యకు పరిష్కారం చూపేలా కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.