అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bihar | అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయిన ఏఎస్ఐ ఇంట్లో భారీగా ఆయుధాలు (weapons) లభించాయి. అదీనూ అధునాతన ఏకే 47, ఏకే 56, బుల్లెట్ మ్యాగ్జిన్లు (bullet magazines) (500 రౌండ్ల బుల్లెట్లు) లభ్యం కావడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. బిహార్‌లోని (Bihar) సమస్తిపూర్‌లో (Samastipur) వెలుగు చూసిన ఈ అంశం సంచనలంగా మారింది.
Bihar | పట్టుబడ్డారు ఇలా..
మొహియుద్దీన్ నగర్ పోలీస్ స్టేషన్ (Mohiuddin Nagar police station) పరిధిలో ఉండే ఏఎస్ఐ సరోజ్ సింగ్ అవినీతి ఆరోపణలతో గతేడాది సస్పెండ్ (suspended) అయ్యాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేయడం, నేరస్థులతో చేతులు కలిపి ఆయుధాలను అక్రమంగా రవాణా చేయడం వంటి ఆరోపణలు ఇతడిపై ఉన్నాయి. ఓ ఇద్దరి హత్యకు సరోజ్ సింగ్‌తో పాటు అతని అనుచరులు ముగ్గురు కలిసి కుట్ర పన్నినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. హత్యల కోసం ఆయుధాలు సమకూర్చుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో STF, మొహద్దినగర్, పటోరి మోహన్‌పూర్, విద్యాపతి నగర్ పోలీస్ స్టేషన్‌ల పోలీసు అధికారులు సంయుక్తంగా దాడులు చేపట్టారు. పోలీసులను చూసిన సరోజ్ సింగ్ పారిపోయేందుకు ప్రయత్నించడంతో పాటు కాల్పులు కూడా జరిపారు.
పోలీసులు చాకచక్యంగా సరోజ్ సింగ్ (Saroj Singh) సహా నలుగురి అరెస్టు చేశారు. అనంతరం అతడి ఇంట్లో సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో సుమారు 500 రౌండ్ల బుల్లెట్లు, ఏ56, ఏకే 47, డబుల్ బారెల్ గన్, మూడు నాటు తుపాకులు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇంకా సోదాలు కొనసాగిస్తున్నారు.
ఈ సోదాలను అధికారికంగా ధ్రువీకరించిన పోలీసులు, స్వాధీనం చేసుకున్న ఆయుధాలపై మాత్రం ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. సోదాలు పూర్తిగా ముగిసిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. సోదాల నేపథ్యంలో సుల్తాన్‌పుర్‌లోని (Sultanpur) తమ కిటికీలు, తలుపులు మూసి ఉంచాలని స్థానికులను పోలీసులు ఆదేశించడం గమనార్హం.