అక్షరటుడే, కామారెడ్డి :Heavy Rains | మొన్నటి వరకు భూగర్భ జలాలు వట్టిపోయి పంట చేతికి వస్తుందో లేదోనన్న భయం అన్నదాత(Annadatha)ను వెంటాడింది. ట్యాంకర్ల సాయంతో, ఇతర మార్గాల ద్వారా ఎండిపోయిన పంటను బతికించుకున్న రైతన్నను తీరా అకాల వర్షాలు(Untimely rains) వెంటాడుతున్నాయి. ఆదివారం కురిసిన వర్షానికి ఒక్క కామారెడ్డి నియోజకవర్గంలోనే 200 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. వడగండ్ల వర్షం పడటంతో రైతులు(Farmers) ఆందోళనకు గురయ్యారు. నియోజకవర్గంలో ఇప్పటికే 60శాతం పంట కోతలు అయిపోయాయి. మరొక 40 శాతం మిగిలి ఉంది. మరో వారం రోజులైతే పంట చేతికి రానుండగా.. ఇంతలోనే అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేసేశాయి.
Heavy Rains | ఈ మండలాల్లోనే అధికం..
నియోజకవర్గంలో ఆదివారం కురిసిన వర్షానికి సుమారు 200 ఎకరాలకు పైగా పంట నష్టం(Crop loss) వాటిల్లిందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. బీబీపేట మండలంలో దాదాపు 150 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు నిర్దారణకు వచ్చారు. రాజంపేట మండలంలో 11ఎకరాలు, కామారెడ్డి మండలంలో 115 ఎకరాల్లో పాక్షికంగా పంట నష్టం జరిగింది.
ప్రభుత్వం ఆదుకోవాలి
– నాగరాజు, రైతు
రెండు రోజుల్లో పంట కోయాలి అనుకున్నాం. ఇంతలోనే కురిసిన వడగండ్ల వాన ఆగం చేసింది. రెండున్నర ఎకరాల్లో వరి ధాన్యం మొత్తం నేలపాలైంది. ప్రభుత్వం(Government) ఆదుకోవాలి.
పాక్షికంగా పంట నష్టం
అపర్ణ, ఏడీఏ కామారెడ్డి
కామారెడ్డి డివిజన్లో అకాల వర్షాలకు పాక్షికంగా పంట నష్టం జరిగింది. డివిజన్లో 200 ఎకరాల్లో 160 మంది రైతులకు(Farmers) నష్టం వాటిల్లింది. పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తాం.