అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Weather Updates | బంగాళాఖాతంలో అల్ప పీడనం (LPA) కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. అల్ప పీడన ప్రభావంతో సోమవారం పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురిశాయి. మంగళవారం కూడా పలు చోట్ల భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మిగతా జిల్లాల్లో మోస్తరు, చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉంది. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు.
Weather Updates | హైదరాబాద్ నగరంలో..
హైదరాబాద్ (Hyderabad) నగరంలో సోమవారం రాత్రి వాన దంచి కొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. గంటల కొద్ది ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. మంగళవారం మధ్యాహ్నం కూడా నగరంలో చిరు జల్లులు పడే అవకాశం ఉంది. సాయంత్రం, రాత్రి పూట మోస్తరు వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు.
Weather Updates | ఉత్తరాది రాష్ట్రాల్లో..
ఉత్తరభారతదేశంలో వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్‌లో కుండపోత వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటికి తోడు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా వర్షాలు ఆగడం లేదు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేసింది.
Weather Updates | ఆంధ్రప్రదేశ్‌లో..
ఆంధ్రప్రదేశ్(AP) తీర ప్రాంతానికి సమీపంగా బంగ్లాదేశ్ – పశ్చిమ బెంగాల్ తీరంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. మిగతా జిల్లాల్లోనూ తక్కువ వర్షాలు పడతాయని AP విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తీర ప్రాంతాల్లో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో తీవ్ర ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
Weather Updates | సాగు పనుల్లో రైతులు బిజీ
రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతుండడంతో అన్నదాతలు (Farmers) హర్షం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనుల్లో రైతులు నిమగ్నం అయ్యారు. వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా వరినాట్లు జోరందుకున్నాయి. ఒకేసారి అందరు నాట్లు ప్రారంభించడంతో కొన్ని కూలీల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.