అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) చెప్పేవన్నీ అబద్ధాలేనని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు సహా కృష్ణ, గోదావరి జలాల విషయంలో ప్రభుత్వ వాదనలన్నీ అసబంద్ధమని మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)లో జరిగిన అవకతవకలపై విచారిస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఎదుట హరీశ్‌రావు శుక్రవారం మరోసారి హాజరయ్యారు. హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లో పీసీ ఘోష్ కమిషన్ (PC Ghosh Commission) ను కలిసి ఓ నివేదికను సమర్పించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కి సంబంధించి పలు విషయాలను వివరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
Harish Rao | కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రభుత్వ అనుమతి
కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు కేబినెట్ అనుమతి ఉందని హరీశ్‌రావు (Harish Rao) పునరుద్ఘాటించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపై ఆరుసార్లు కేబినెట్ ఆమోదం పొందిందని గుర్తుచేశారు. అసెంబ్లీలో కూడా మూడుసార్లు ఆమోదించారని తెలిపారు. ఈ వివరాలన్నీ డాక్యుమెంట్లతో సహా కాళేశ్వరం కమిషన్‌కు ఇచ్చానని చెప్పారు. మిగిలిన వివరాలన్నీ రేవంత్ ప్రభుత్వం (Revanth Government) దగ్గరే ఉన్నాయని. అయితే, ఆయా వివరాలు ఇవ్వాలని పీసీ ఘోష్ కమిషన్ అడిగితే ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినవన్నీ అసత్యాలేనని ఆరోపించారు. 50 ఏళ్లుగా కాంగ్రెస్‌వి అబద్ధాలు, మోసాలేనని విమర్శించారు.
Harish Rao | తొండి వాదన..
నదీ జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది తొండి వాదన అని ఎద్దేవా చేశారు. కృష్ణా జలాల్లో 299 టీఎంసీల కేటాయింపు కాంగ్రెస్ పాపమేనని మండిపడ్డారు. సెక్షన్ 3 కింద నీళ్లు పంపిణీ చేయాలని ఆనాడే అడిగారని గుర్తుచేశారు. రెండ్రోజుల క్రితం ప్రజాభవన్ (Praja Bhavan)లో కాళేశ్వరంపై ప్రభుత్వం ఇచ్చింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదు, కవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి 50 ఏళ్లు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవడానికే కవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందన్నారు.
Harish Rao | కాంగ్రెస్ హయాంలోనే అన్యాయం..
కాంగ్రెస్ వల్లే నీటి కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరగిందని హరీశ్‌రావు ఆరోపించారు. ఇదేమీ తెలియని సీఎం రేవంత్‌రెడ్డి అజ్ఞానం, అహంకారం బయటపెట్టుకున్నారన్నారు. 299 టీఎంసీల పేరుతో శాశత్వ ఒప్పందమని సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆనాడే 299 టీఎంసీలకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో ఒప్పందం చేశారని గుర్తుచేశారు. శాశ్వత ఒప్పందాన్ని మాజీ సీఎం కేసీఆర్ చేసి ఉంటే.. సెక్షన్ -3 కోసం ఎందుకు పోరాటం చేస్తారని నిలదీశారు. సెక్షన్-3 విషయంలో గతంలో ఉమాభారతి, గడ్కరీనీ కేసీఆర్ కలిశారని గుర్తు చేశారు.
కేంద్రప్రభుత్వంపై పోరాటం చేసి సెక్షన్-3ని కేసీఆర్ సాధించారన్నారు. కృష్ణా బోర్డు తాత్కాలిక నీటి వినియోగం కోసం ఒప్పందం చేస్తుందని తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి(Minister Uttam Kumar Reddy), సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) సైతం 299 టీఎంసీలకు సంతకాలు చేశారని.. మరి మీరు ఎందుకు సంతకాలు చేశారని ప్రశ్నించారు. కృష్ణా నదిలో తెలంగాణ వాటాను రేవంత్ ప్రభుత్వం సాధించాలని కోరారు.
Harish Rao | గురువు చంద్రబాబుకు నీళ్ల అప్పగింత..
తన రాజకీయ గురువు అయిన చంద్రబాబుకు కృష్ణా జలాలను రేవంత్‌రెడ్డి అప్పగించారని హరీశ్‌రావు విమర్శించారు. కృష్ణానదిని దోచుకో అని రేవంత్‌రెడ్డి చంద్రబాబు(Chandrababu)కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి అజ్ఞానాన్ని తాను బయటపెట్టిన తర్వాత ఆయన మాట మార్చారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డికి ఎలాగూ తెలియదు… ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కూడా తెలీదంటేనే బాధేస్తోందని చెప్పారు. సీఎం చంద్రబాబు చెప్పినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందా? అని ప్రశ్నించారు. 573 టీఎంసీలు చాలని మంత్రి ఉత్తమ్ చెప్పడం అజ్ఞానమని విమర్శించారు.