అక్షరటుడే, బాన్సువాడ : Grama Panchayats | గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన పడకేసింది. 16 నెలలుగా పాలకవర్గాలు లేకపోవడంతో పల్లెలను పట్టించుకునేవారు కరువయ్యారు. ప్రత్యేకాధికారులను (special officers) నియమించినా వారు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో పాలన గాడి తప్పింది. దీంతో అభివృద్ధి పనులు అటకెక్కాయి. కనీసం పారిశుధ్య పనులు కూడా సక్రమంగా సాగడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
పల్లెల్లో స్పెషలాఫీసర్ల పరిపాలన అస్తవ్యస్తంగా తయారైంది. సర్పంచ్లు లేక గ్రామ పాలన భారమంతా పంచాయతీ కార్యదర్శులపై (Grama panchayat secretaries) పడింది. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు నుంచి పారిశుధ్యం, తాగు నీటి సమస్య, విధి దీపాలు ఇలా అన్ని బాధ్యతలు కార్యదర్శులే మోయాల్సి వస్తోంది. దీనితోడు నిధుల లేమి మరో సమస్యగా మారింది. కనీసం పారిశుధ్య కార్మికులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. పంచాయతీ కార్యదర్శులే అత్యవసర పనులకు సొంతంగా నిధులు వెచ్చించాల్సి వస్తోంది. ఈ కారణంగా అభివృద్ధి దేవుడెరుగు.. కనీస నిర్వహణ కరువైంది.
Grama Panchayats | ఉమ్మడి జిల్లాలో వెయ్యికిపైగా గ్రామ పంచాయతీలు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో (Joint Nizamabad districts) వెయ్యికి పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో నిజామాబాద్లో 545, కామారెడ్డిలో 537 జీపీలు ఉన్నాయి. ఆయా పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం గతేడాది ఫిబ్రవరితో ముగిసింది. అప్పటి నుంచి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదు. దీంతో ప్రత్యేకాధికారుల పాలనల్లో గ్రామాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి.
Grama Panchayats | సొంత ఖర్చులతో..
గతంలో సర్పంచులు ఉన్నప్పుడు నిధులు లేకున్నా.. సొంత ఖర్చులతో పనులు చేపట్టేవారు. ప్రస్తుతం జీపీ కార్యదర్శులు, ప్రత్యేకాధికారులు నిధులు లేవని చేతులు ఎత్తేస్తున్నారు. దీంతో కార్మికులు కొన్ని నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. ఏప్రిల్ నుంచి జీతాలు రావడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కార్మికులు నిరసనలు చేపడుతున్నారు. అయినా అధికారులు ఏమి చేయలేని పరిస్థితి.
Grama Panchayats | అస్తవ్యస్తంగా పారిశుధ్యం
నిధులు.. పాలకవర్గాలు లేకపోవడంతో గ్రామాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. చాలా గ్రామాల్లో కార్మికులు జీతాలు రాకపోవడంతో పూర్తిస్థాయిలో పనులు చేయడం లేదు. డ్రెయినేజీలు శుభ్రం చేయడం మానేశారు. నీటి సరఫరా నిలిపివేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు నిధులు లేకపోవడంతో చెత్త సేకరణ సైతం నిలిపేశారు. జీపీ ట్రాక్టర్లు, ట్యాంకర్లు నిరుపయోగంగా ఉంటున్నాయి. దీంతో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. అసలే వర్షాకాలం కావడంతో వ్యాధుల ముప్పు పొంచు ఉంటుంది. ఇలాంటి సమయంలో గ్రామాలను పట్టించుకునే వారు లేక పరిస్థితి అధ్వానంగా మారింది.

Grama Panchayats | మంచినీరు రావడం లేదు
– అంజవ్వ, దేశాయిపేట్
గ్రామంలో కుళాయిల ద్వారా తాగునీరు రావడం లేదు. దీంతో పంట పొలాలు, దూర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తోంది. డ్రెయినేజీలు శుభ్రం చేయక కంపు కొడుతున్నాయి.
Grama Panchayats | జీతాలు రావడం లేదు

– కిష్టవ్వ, పంచాయతీ కార్మికురాలు, దేశాయిపేట
మూడు, నాలుగు నెలల నుంచి జీతాలు రావడం లేదు. కుటుంబం గడవడం చాలా కష్టంగా మారింది. అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Grama Panchayats | ప్రతినెలా వేతనాలు చెల్లించాం

– వెంకటరమణారావు దేశ్ముఖ్, మాజీ సర్పంచ్, కోనాపూర్
ప్రతినెలా పంచాయతీ కార్మికులకు ఎప్పటికప్పుడు వేతనాలు చెల్లించాం. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలలో ఆలస్యమైతే కార్మికులకు సొంత డబ్బులతో వేతనాలు చెల్లించేవాళ్లం.
Grama Panchayats | కార్మికుల ఖాతాల్లోనే నేరుగా జమ

– సత్యనారాయణ రెడ్డి, డీఎల్పీవో, బాన్సువాడ
పంచాయతీ కార్మికులకు నేరుగా ఖాతాలోనే వేతనాలు జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు జీతాలు రాలేదు. త్వరలో వేతనాలు అకౌంట్లో జమ చేయనుంది.