అక్షరటుడే, వెబ్డెస్క్: GPO Posts | రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న పలు పోస్టులకు ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
తాజాగా ఆరు వేలకు పైగా గ్రామ పరిపాలన అధికారి (GPO) పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని యోచిస్తోంది.
GPO Posts | మొత్తం 10,954 పోస్టులు
గతంలో రాష్ట్రంలో వీఆర్వోలు, వీఆర్ఏలు ఉండేవారు. గ్రామస్థాయి రెవెన్యూ విషయాల్లో వీరిదే కీలక పాత్ర. అయితే వీఆర్వోలు(VRO) భారీగా అవినీతికి పాల్పడుతున్నారని భావించిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS government) 2020లో వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలను రద్దు చేసింది.
వీఆర్వోలను ఇతర శాఖల్లో సర్దు బాటు చేసింది. వీఆర్ఏ (VRA)లను సైతం వారి అర్హతను బట్టి వివిధ శాఖల్లోకి పంపింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గ్రామీణ స్థాయిలో మళ్లీ రెవెన్యూ అధికారులు (Revenue Officers) ఉండాలని భావించింది. ఇందులో భాగంగా 10,954 మంది జీపీవోలను నియమించాలని నిర్ణయించింది. ముందుగా ఈ పోస్టులకు గతంలో వీఆర్ఏ, వీఆర్వోగా పని చేసిన వారికి అవకాశం కల్పించాలని వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. దీంతో తక్కువ సంఖ్యలో వీఆర్ఏ, వీఆర్వోలు దరఖాస్తు చేసుకున్నారు. వారికి పరీక్ష పెట్టగా.. 3,454 మంది మాత్రమే జీపీవో పోస్టులకు(GPO posts) ఎంపికయ్యారు.
GPO Posts | మిగతా వారికోసం..
మొత్తం 10,954 గ్రామ పరిపాలన అధికారి పోస్టులకు ప్రస్తుతం 3,454 మంది మాత్రమే ఎంపికయ్యారు. దీంతో వారికి ఇంకా ఆర్డర్ కాపీలు అందజేయలేదు. అయితే మరోసారి వీఆర్వో, వీఆర్ఏల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ఇటీవల రెవెన్యూ ఉద్యోగుల సంఘాల నాయకులు కోరారు. దీంతో మళ్లీ పరీక్ష నిర్వహిస్తే దాదాపు 15 వందల మంది ఎంపికయ్యే అవకాశం ఉంది.
GPO Posts | డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా..
వీఆర్ఏ, వీఆర్వోల నుంచి జీపీవోలుగా ఎంపిక కాగా.. మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ (Direct Recruitment) ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి నియామక పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా భూ భారతి పోర్టల్ (Bhu Bharati Portal) ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. భూ భారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడంలో సర్వేయర్లు, జీపీవోల పాత్ర కీలకం అని ప్రభుత్వం చెబుతోంది. దీంతో జీపీవోలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఐదు వేల సర్వేయర్లను కూడా నియమించినుంది. కాగా జీపీవో పోస్టులకు ఇంటర్ చదివిన వారు అర్హులని సమాచారం. దీనికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ వెలువడితే గాని స్పష్టత రాదు.