అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vande Bharat | దేశంలో ఎక్కువ మంది ప్రజలు రైళ్లలోనే ప్రయాణిస్తుంటారు. దీంతో రైల్వే శాఖ ఎప్పటికప్పుడు రైళ్లను ఆధునికీకరిస్తూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి ప్రయత్నిస్తోంది.
ఇందులో భాగంగా వేగంగా వెళ్లే వందే భారత్ రైళ్ల(Vande Bharat Trains)ను ప్రవేశపెట్టింది. అన్ని వసతులతో ఎక్కువ వేగంతో వెళ్లే వందే భారత్ రైళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో వందే భారత్ స్లీపర్ రైళ్ల(vande bharat sleeper trains)ను కూడా రైల్వేశాఖ తీసుకు రానుంది. ఇప్పటికే పలు మార్గాల్లో వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. తాజాగా తెలుగు రాష్ట్రాలకు రైల్వేశాఖ రెండు వందే భారత్ స్లీపర్ రైళ్లను కేటాయించింది.
దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లకు విశేష ఆదరణ లభిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం వాటి సేవలను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి తీసుకు వస్తోంది. తెలుగు రాష్ట్రాలకు కూడా రెండు రైళ్లను కేటాయించనుంది. ఢిల్లీ– సికింద్రాబాద్, విజయవాడ–బెంగళూరు మధ్య ఈ రైళ్లు నడవనున్నాయి.
Vande Bharat | ఢిల్లీ – సికింద్రాబాద్ రైలు
న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్(Delhi- Secunderabad) మధ్య ఒక వందే భారత్ స్లీపర్ రైలు నడవనుంది. ఈ రైలు ఆగ్రా క్యాంట్, గ్వాలియర్, ఝాన్సీ, భోపాల్, ఇటార్సి, నాగపూర్, బల్హార్షా, కాజిపేట్ జంక్షన్ స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. రాత్రి 8:50 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
టికెట్ ధరలు
థర్డ్ ఏసీ – రూ.3,600, సెకండ్ ఏసీ – రూ.4,800, ఫస్ట్ ఏసీ రూ.6,000
Vande Bharat | విజయవాడ – బెంగళూరు మార్గంలో..
విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు (Vijayawada – Bengaluru) రైల్వే శాఖ వందే భారత్ స్లీపర్ రైలును నడపనుంది. ఈ రైళ్లు అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు ఎంతో సమయం ఆదా కానుంది. విజయవాడ నుంచి అయోధ్య, వారణాసి వంటి ప్రదేశాలకు వందే భారత్ సర్వీసులు ప్రారంభించే అవకాశముందని ఏపీ అధికారులు తెలుపుతున్నారు.