అక్షరటుడే, వెబ్డెస్క్: Toll charges | జాతీయ రహదారులపై (national highways) ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పనుంది. ప్రస్తుతం విధిస్తున్న టోల్ ట్యాక్స్ నుంచి మినహాయింపు కల్పించనుంది.
అయితే, రహదారుల విస్తరణ సమయంలో మాత్రమే ఇది వర్తించే అవకాశముంది. వాహనాల రద్దీ దృష్ట్యా జాతీయ రహదారులను విస్తరిస్తున్నారు. రెండు వరుసల రహదారిని ఫోర్ లేన్ గా, ఫోర్ లేన్ రోడ్ ను ఆరు వరుసలుగా అభివృద్ధి చేస్తున్నారు. విస్తరణ పనుల సమయంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో టోల్ టాక్స్ నుంచి కొంత మినహాయింపు ఇవ్వాలని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ (Ministry of Road Transport) యోచిస్తోంది.
Toll charges | కొత్త ప్రతిపాదన..
రహదారుల విస్తరణ సమయంలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. రోడ్ల నిర్మాణం, విస్తరణ సమయంలో వన్ వేలో మాత్రమే రాకపోకలు అనుమతిస్తారు. దీని వల్ల వాహనదారులకు మెరుగైన సేవ లభించదు. కాబట్టి టోల్ రుసుం నుంచి మినహాయింపు ఇవ్వాలని రోడ్డు రవాణ మంత్రిత్వ శాఖ ఓ ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ప్రస్తుతం కొన్ని జాతీయ రహదారుల నిర్మాణాలు (national highways construction) పూర్తి కాకపోయినా టోల్ వసూలు చేస్తున్నారు. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే, నిర్మాణ సమయంలో హైవేపై ప్రయాణించే వ్యక్తి సాధారణ టోల్ సుంకం నుంచి 30 శాతం వరకు మినహాయింపు లభిస్తుంది. నాలుగు లేన్ల రహదారులను ఆరు లేన్లుగా విస్తరించే లేదా ఆరు లేన్ల రహదారులను ఎనిమిది లేన్లుగా విస్తరించే సందర్భంలో, నిర్మాణ దశలో 75 శాతం మాత్రమే టోల్ వసూలు చేయాలని ప్రతిపాదించారు.
కేంద్ర ప్రభుత్వం (central government) వాహనదారులకు ఉపశమనం కలిగించేలా కొన్ని విధాన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రూ. 3,000 వార్షిక టోల్ పాస్ పథకాన్ని (toll pass scheme) ప్రకటించింది. జాతీయ రహదారులపై ఏటా 200 సార్లు ఉచితంగా టోల్ ప్లాజాలను దాటడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఇక, వంతెనలు, సొరంగాలు, ఫ్లైఓవర్లు, హైవేలలోని ఎలివేటెడ్ సెక్షన్ల వంటి నిర్మాణాలకు టోల్ రేట్లను 50 శాతం వరకు తగ్గించడానికి ఒక కొత్త నియమాన్ని తీసుకొచ్చింది. ఇది వాణిజ్య, భారీ వాహనాలకు ప్రయోజనం చేకూరుస్తుంది.