అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cyber Fraud | దేశంలో సైబర్ నేరాలు (Cyber Crimes) పెరిగిపోతున్నాయి. రోజుకో కొత్త మార్గంలో సైబర్ నేరస్తులు ప్రజల ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఆశ చూపి కొందరు.. భయ పెట్టి మరికొందరు ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు (police) సైబర్ నేరాలకు గురికాకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పోలీసు కళాజాత బృందాలు సైబర్ నేరాలపై(Cyber Frauds) అప్రమత్తంగా ఉండాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అయినా ప్రజలు మోసపోతూనే ఉన్నారు. అయితే సైబర్ నేరానికి గురైనా.. గంటలోపు ఫిర్యాదు చేస్తే పోయిన డబ్బులు తిరిగి పొందవచ్చు.
ఒక్కొసారి మనకు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేస్తారు. బెదిరించో.. ఆశ చూపో ఖాతాలోని డబ్బులు కాజేస్తారు. అయితే ఖాతాలో నుంచి డబ్బులు కట్ కాగానే ఆందోళన చెందకుండా.. సైబర్ క్రైం విభాగం టోల్ ఫ్రీ (Cyber Crime Number) నంబర్ 1930కి ఫోన్ చేసి వివరాలు అందించాలి. గంటలోపు కంప్లైంట్ చేయడం ద్వారా డబ్బు రీఫండ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫిర్యాదు చేసేటప్పుడు ఖాతా వివరాలు ఇస్తే పోలీసులు వెంటనే సైబర్ నేరగాళ్ల అకౌంట్లను ఫ్రీజ్ చేస్తారు. సైబర్ బాధితులకు ఈ గోల్డెన్ అవర్ (Golden Hour) ఎంతో కీలకం. అందుకే పోలీసులు దీనిపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సైబర్ నేరానికి గురయితే గోల్డెన్ అవర్‌లో కంప్లైంట్ చేయాలని కోరుతున్నారు.
Cyber Fraud | బలవుతున్న ఎంతోమంది
సైబర్ నేరస్తుల చేతికి చిక్కి ఎంతో మంది బలి అవుతున్నారు. వీరిలో ఉన్నత విద్యా వంతులు కూడా ఉండటం గమనార్హం. ఇటీవల ఓ మహిళా పార్ట్ టైం జాబ్ పేరిట టెలిగ్రామ్ యాప్‌లో ప్రకటన చూసి వారిని సంప్రదించింది. మొదట పెట్టుబడి పెడితే డబ్బులు వస్తాయని వారు నమ్మించారు. దీంతో ఆ మహిళ రూ.లక్ష వారు చెప్పినట్లు పెట్టుబడి పెట్టింది. తర్వాత మోసపోయానని తెలియడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. గతంలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి సైతం స్టాక్ మార్కెట్ పేరిట సైబర్ నేరగాళ్లు చెప్పిన మాటలు నమ్మి రూ.లక్షలు పోగొట్టుకున్నారు.
Cyber Fraud | ఇలా మోసం చేస్తారు..
సైబర్ నేరగాళ్లు మీకు లాటరీ వచ్చిందని కొంత డబ్బులు కట్టాలని ఫోన్లు చేస్తారు. రూ.లక్షల లాటరీ డబ్బులు ఇచ్చే వారు.. డబ్బు ఎందుకు కట్టమంటారని ఆలోచిస్తే వారి నుంచి తప్పించుకోవచ్చు. పార్ట్ టైం జాబ్(part Time Job), వర్క్ ఫ్రం హోమ్ (Work From Home) పేరిట కూడా మోసాలు చేస్తారు. అయితే జాబ్ ఇచ్చే వారు సాలరీ ఇస్తారు.. వారికి మనం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అలా అడిగారంటే సైబర్ నేరస్తులుగా గుర్తించాలి.
మీకు భారీ గిఫ్ట్ వచ్చిందని దానిని డెలివరీ చేయడానికి డబ్బులు కావాలని ఫోన్ చేస్తారు. అయితే మనకు ఎవరు ఊరికే బహుమతులు పంపరనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అలాగే మీకు వచ్చిన పర్సల్లో డ్రగ్స్ ఉన్నాయని కస్టమ్స్ అధికారుల పేరిట ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడతారు. అలాంటి సమయంలో భయ పడకుండా 1930 నంబర్‌కు ఫోన్ చేయాలి. లేదంటే స్థానిక పోలీసులను సంప్రదించాలి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి సైబర్ నేరగాళ్లు ఎక్కువ మోసాలకు పాల్పడతారు.
అత్యాశకు పోకుండా ఫోన్ చేయగానే.. కొంచెం ఆలోచిస్తే సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉంటాం. అలాగే ఎవరికీ బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు ఇవ్వొద్దు. గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే లింకులు క్లిక్ చేయొద్దు. ఏపీకే ఫైళ్లు డౌన్లోడ్ చేసుకోవద్దు. ఒకవేళ డబ్బులు కట్ అయితే గంటలోపు 1930 నంబర్‌కు ఫోన్ చేయాలి.